
జిల్లా మహానాడుకు తమ్ముళ్ల ఝలక్
నెల్లూరు సిటీ: టీడీపీ నేతలు ఆర్భాటంగా నిర్వహించిన జిల్లా మహానాడుకు తమ్ముళ్లు ఝలక్ ఇచ్చారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కనుపర్తిపాడులో ఉన్న వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం జిల్లా మహానాడు నిర్వహించారు. ఇద్దరు మంత్రులతోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలను వాహనాలు ఏర్పాటు చేసి మరీ తరలించారు. అయితే మహానాడు కార్యక్రమం ప్రారంభమైన గంట వ్యవధిలో తమ్ముళ్లు తలోదారి పట్టుకుని వెళ్లిపోవడంతో ప్రారంభంలోనే నిండుగా ఉన్న హాల్ ముప్పాతికపైగా ఖాళీ అయిపోయింది. మంత్రి ఆనం రామానారాయణరెడ్డి మాట్లాడే సమయానికి ముందు వైపు మూడు, నాలుగు వరుసల్లోనే కార్యకర్తలు మిగిలి ఉన్నారు. వాస్తవానికి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో 5 వేల మంది సీటింగ్ కెపాసిటీ ఉంది. అయితే మహానాడు వాస్తవ పరిస్థితి చూస్తే.. నాలుగు వరుసల్లో కనీసం 200 మంది కూడా లేరని ఈ చిత్రమే చెబుతోంది. వేదిక మీద కూర్చొన్న పార్టీ పెద్దలే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. నియోజకవర్గానికి నాలుగొందల మంది వచ్చినా.. ఎనిమిది నియోజకవర్గాల నుంచి కనీసం 4 వేల మంది అయ్యేవారు. వేదిక ముందు కూర్చొన్న 200 మందిని చూస్తే నాయకుల అనుచరులు తప్ప.. సామాన్య కార్యకర్తలు ఎవరూ అక్కడ కనిపించలేదని స్పష్టమవుతోంది. ఇదే క్షేత్రస్థాయిలో టీడీపీ బలమని పరోక్షంగా రుజువైంది. దీంతో మహానాడు కార్యక్రమంలో ముఖ్యనేతలు ప్రసంగాలను తూతూ మంత్రంగా ముగించారు.
గంట వ్యవధిలోనే ఖాళీ అయిన కుర్చీలు
మొక్కుబడి ప్రసంగాలతో
ముగించిన మంత్రులు