
దళిత ఉద్యోగులపై కన్నెర్ర
మాట వింటే ఓకే.. లేకపోతే వేటే
●
నిధులు దుర్వినియోగం చేసిన వారినే సస్పెండ్ చేస్తున్నాం
పంచాయతీ కార్యదర్శులపై అవినీతి ఆరోపణలొస్తున్నాయి. లేఖల ద్వారా ఫిర్యాదు చేసిన వాటిపై డీఎల్పీఓలను విచారణాధికారులుగా నియమిస్తున్నాం. నిధులు దుర్వినియోగమయ్యాయనే అంశం నిర్ధారణైతే పంచాయతీరాజ్ కమిషనర్, కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నాం.
– శ్రీధర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి
కూటమి ప్రభుత్వం కొలువుదీరాక దళిత ఉద్యోగులపై వేధింపుల పరంపర కొనసాగుతోంది. తమ ప్రజాప్రతినిధులకు అనుకూలంగా ఉండే పంచాయతీ కార్యదర్శులను అందలమెక్కిస్తూ.. నిబంధనలను పాటిస్తూ.. మాటవినని వారిని వేధిస్తూ.. ఆకాశరామన్న ఉత్తరాల పేరిట విచారణ జరిపి సస్పెన్షన్ వేటేస్తోంది. గడిచిన ఏడు నెలల్లో జిల్లా పంచాయతీ శాఖలో 24 మంది పంచాయతీ కార్యదర్శులు సస్పెన్షన్‌కు గురికాగా, వీరిలో 14 మంది ఎస్సీ, ఎస్టీలే కావడం గమనార్హం. ఈ తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. పంచాయతీ కార్యదర్శులను వేధిస్తూ పైశాచికానందాన్ని పొందుతోంది. జిల్లా పంచాయతీ శాఖలో ఈ తతంగం శ్రుతిమించుతోంది.
ఇదీ తీరు..
గతంలో పంచాయతీ కార్యదర్శిపై రాష్ట్ర నేత పేరుతో ఫిర్యాదు చేశారు. సంబంధిత లేఖ నేతకు చేరడంతో తాను చేయలేదని, ఈ అంశమై కోర్టును ఆశ్రయిస్తామని ఆయన బదులిచ్చారు. దీంతో కంగుతిన్న పంచాయతీ అధికారులు సర్దుబాటు చేసుకున్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో ఎంతోకాలంగా పనిచేస్తున్న అధికారి.. తనకు కూటమి ప్రభుత్వంలోని మంత్రి అండదండలున్నాయనే అహంకారంతో కిందిస్థాయి సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విచారణ పేరిట ముడుపులు
ఆకాశరామన్న ఉత్తరాలు రాయడం.. విచారణ పేరుతో అధికారులు తనిఖీ చేసి లంచాలివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీటిని సమర్పించలేని పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ఆధారాలు చూపినా, పంచాయతీరాజ్ కమిషనర్‌కు నివేదికలు పంపి అక్కడి నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వేధింపులు, సస్పెన్షన్లు అధికమవుతున్నాయి.
అనుకూలంగా ఉంటేనే ప్రోత్సాహం
కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, మండల నేతలకు అనుకూలంగా ఉండేవారినే ప్రోత్సహిస్తున్నారు. అలా వ్యవహరించని పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటేస్తున్నారు. కోవూరు మండలం గంగవరం పంచాయతీ కార్యదర్శి నాయబ్ రసూల్‌ను వేధింపులకు గురిచేశారని సమాచారం. అడిగినంత ముట్టజెప్పకపోవడంతో త్వరలో సస్పెన్షన్ ఉత్తర్వులు పంపుతామంటూ అధికారులు బెదిరింపులకు దిగారనే విమర్శలు వినిపిస్తున్నా యి. సంగంలో పనిచేస్తున్న మహిళా కార్యదర్శికి ఇదే తరహాలో హెచ్చరికలు జారీ చేశారని సమాచారం. జిల్లావ్యాప్తంగా అనేక మండలాల్లో పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి ఇదే తరహాలో ఉంది. వాస్తవానికి పంచాయతీకి సంబంధించిన ఇంటి, కుళాయి పన్నులను వసూలు చేసి జిల్లా ఖజానాలో జమ చేయాల్సి ఉంది. అయితే నిధుల లేమి కారణంగా పారిశుధ్యం, బ్లీచింగ్, తదితరాలకు ఈ నిధులనే వినియోగిస్తున్నారు. ఇలాంటి వాటిని అధికారులు తప్పుపట్టి బెదిరింపులకు దిగుతున్నారని తెలుస్తోంది.
మంత్రి మనిషినంటూ హల్‌చల్
మంత్రి మనిషినని చెప్పుకొనే అధికారి కార్యాలయంలో హల్‌చల్ చేస్తున్నారు. ముడుపులను సమర్పించాలంటూ కోవూరులో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను పలుమార్లు డిమాండ్ చేశారనే ఆరోపణలున్నాయి. సయోధ్య కుదరకపోవడంతో సస్పెండ్ చేశారు. పొదలకూరుకు సంబంధించిన పంచాయతీ కార్యదర్శి దొరబాబు, సంగం మండలంలో పనిచేసిన అల్లాబక్షుపై అవినీతి ఆరోపణలొచ్చాయి. వీటిపై విచారణ జరిపినా, ఇప్పటికీ చర్యలు చేపట్టలేదు. తమకు అనుకూలంగా ఉంటూ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వారికి అండగా నిలుస్తున్నారు.
ఏడు నెలల్లో 24 మంది పంచాయతీ
కార్యదర్శుల సస్పెన్షన్
అందులో 14 మంది ఎస్సీ, ఎస్టీలే
నిధుల దుర్వినియోగం సాకు చూపి చర్యలు
పంచాయతీ శాఖ కార్యాలయంలో
ఇదీ తంతు