
కోనలో హనుమజ్జయంతి
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో గురువారం హనుమజ్జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి మూలమూర్తికి అభిషేకం, పూలంగిసేవ, ఆకుపూజ జరిపారు. సాయంత్రం తిరుచ్చిపై ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహం కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి కోన మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు.
ఏపీ ఎల్డీఏ చైర్మన్‌గా
గొల్లపల్లి కొనసాగింపు
కోవూరు: ‘కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో పలు నామినేటెడ్ పదవులను రద్దు చేసింది. కానీ ఏపీ ఎల్డీఏ కమిటీని యథావిధిగానే కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది’ అని చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ తెలిపారు. ఆయన గురువారం కోవూరులోని జిల్లా పశుసంవర్థక శాఖకు చెందిన సెమన్ బ్యాంక్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కమిటీని రద్దు చేస్తూ గతంలో కలెక్టర్ ఆదేశాలిచ్చారన్నారు. దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించామన్నారు. ప్రస్తుతం ఉన్న కమిటీ నామినేటెడ్ కాదని, ఎన్నికల ద్వారా ఏర్పడిందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆ మేరకు ఆదేశాలిచ్చిందని విజయకుమార్ తెలిపారు.
రైల్లోంచి పడి..
● గుర్తుతెలియని వ్యక్తి మృతి
కొడవలూరు: రైల్లో నుంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన కొడవలూరు – పడుగుపాడు రైల్వేస్టేషన్ల మధ్య గురువారం జరిగింది. మృతుడి వయసు 35 – 40 సంవత్సరాల మధ్య ఉంటుంది. లైట్ బ్లూ కలర్ హాఫ్ హ్యాండ్స్ షర్ట్, బ్లూ, వైట్, బ్లాక్ చెక్స్ లుంగీ, వైట్ కలర్ కట్ బనియన్ ధరించి ఉన్నారు.రైల్లో నుంచి పడి చనిపోయి ఉంటాడని రైల్వే ఎస్సై రమాదేవి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి ఆచూకీ తెలిస్తే కావలి రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు.
హంస వాహనంపై విహారం
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: జొన్నవాడలోని మల్లికార్జున సమేత కామాక్షితాయి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామి, అమ్మవారు హంస వాహనంపై విహరించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఈఓ శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు.
లక్ష మంది శ్రామికులు
హాజరయ్యేలా చర్యలు
నెల్లూరు(పొగతోట): ఉపాధి హామీ పనులకు లక్ష మంది శ్రామికులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ గంగా భవాని ఆదేశించారు. గురువారం నెల్లూరులోని డ్వామా కార్యాలయం నుంచి ఏపీఓలు, ఈసీలు, టీఏలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పీడీ మాట్లాడారు. వర్షాల కారణంగా నాలుగు రోజుల నుంచి కూలీల సంఖ్య తగ్గిందన్నారు. వచ్చే వారం నుంచి లక్షమంది శ్రామికులు పనులు నిర్వహించాలన్నారు. ఫాంపాండ్స్, ఇంకుడుగుంతలు తదితర లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. పల్లెవనం, చెరువుల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

కోనలో హనుమజ్జయంతి

కోనలో హనుమజ్జయంతి