
పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు
నెల్లూరు రూరల్: పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులను వివిధ శాఖలు త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గురువారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు వ్యవహరించని అధికారులపై క్రమశిక్షణ చర్యలకు వెనుకాడేదిలేదని స్పష్టం చేశారు. ఆటోనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ సంస్థల ఆధునికీకరణ పథకాన్ని జిల్లాలో అమలు చేయాలని సూచించారు.
● పీఎం టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమ అమల్లో భాగంగా వివిధ కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా టీబీ బాధితులకు ఆర్థిక, పోషక సాయాన్ని అందించాలని కోరారు.
● జూన్ 21న నిర్వహించనున్న యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రానికి ప్రధాని మోదీ విచ్చేయనున్న క్రమంలో యోగాంధ్ర పేరుతో జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నెల పాటు నిర్వహించనున్నామని వెల్లడించారు. కృష్ణపట్నం పోర్టు, ఎడిబుల్ ఆయిల్ యూనిట్ ఉద్యోగులు, ఇతర పరిశ్రమ వర్గాలు తమ పరిధిలో యోగాను ఆచరించేలా అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లా పరిశ్రమల శాఖ జీఎం మారుతిప్రసాద్, ఏపీఐఐసీ జెడ్‌ఎం శివకుమార్, ఆర్డీఓలు అనూష, పావని, విద్యుత్, ఆర్ అండ్ బీ ఎస్‌ఈలు విజయన్, గంగాధర్, డీటీసీ చందర్, జిల్లా టీబీ నివారణాధికారి ఖాదర్‌వలీ, కమిటీ సభ్యులు ఏపీకే రెడ్డి, ఒమ్మిన సతీష్ తదితరులు పాల్గొన్నారు.