
ఎవరేమనుకుంటే.. నాకేంటి..!
వెంకటాచలం: మండలంలోని తాటిపర్తిపాళెంలో టీడీపీ నేత నిర్వాకంతో రూ.పది లక్షల ప్రభుత్వ ధనం వృథా అయింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో 130 మీటర్ల పొడవుతో రూ.పది లక్షల అంచనాతో సీసీ రోడ్డును మంజూరు చేశారు. అయితే గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేత సదరు రోడ్డును ప్రజలకు ఉపయోగడేలా కాకుండా తమ బంధువుల పొలాల్లోకి వెళ్లేలా నిర్మించారు. ఆ సమయంలో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినా, పెడచెవిన పెట్టి తన ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. గ్రామంలో పలు నివాసాల మధ్యలో మట్టి రోడ్లు ఉన్నా, అక్కడ కాకుండా పొలాల మధ్య నిర్మించడంపై స్థానికులు మండిపడుతున్నారు. టీడీపీ నేత బంధువులకు సంబంధించిన నాలుగెకరాల పొలంలోకి వెళ్లేందుకు ప్రభుత్వ ధనంతో రోడ్డును నిర్మిస్తారానని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటికకు వెళ్లేందుకు అంటూ అధికారులను తప్పుదోవ పట్టించారనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ విషయమై పీఆర్ ఏఈ సాదిక్‌ను సంప్రదించగా, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని బదులిచ్చారు.
పంట పొలంలో
సీసీ రోడ్డు నిర్మాణం
ఉపాధి నిధులతో
టీడీపీ నేత ఇష్టారాజ్యం
తాటిపర్తిపాళెంలో నిర్వాకం