
నేత్రపర్వంగా రావణసేవ
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడలో కొలువైన మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి, అమ్మవార్లకు ఉదయం తిరుచ్చి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం రావణ సేవను వేద పండితులు నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవదేవేరులను దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఏర్పాట్లు ఈఓ శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు.
శాంతిభద్రతలకు
పటిష్ట చర్యలు
● ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, నేరస్తులను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించొద్దని, వారిపై కఠినంగా వ్యవహరించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ జి. కృష్ణకాంత్‌తో కలిసి పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. శాంతి భద్రతలపై ఆరాతీసి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. రౌడీషీటర్లు, పాతనేరస్తుల కదలికలపై నిశిత నిఘా ఉంచాలని, యాక్టివ్ రౌడీషీటర్లపై పీడీయాక్ట్‌లు నమోదు చేయాలని ఆదేశించారు. మత్తు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
రెండు బైక్‌లు ఢీకొని యువకుడి మృతి
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: విధులు ముగించుకొని బైక్‌లో ఇంటికి వెళ్తున్న వ్యక్తిని మరో బైక్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మరణించిన ఘటన మండలంలోని కాగులపాడు వద్ద శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. పెనుబల్లికి చెందిన ఏడుకొండలు (35) కోవూరు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళ్తుండగా కాగులపాడు వద్ద మల్లెతోటలో నుంచి ఓ వ్యక్తి బైక్‌తో సడన్ రోడ్డుపైకి రావడంతో ఏడుకొండలు బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏడుకొండలను నెల్లూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సంతోష్‌రెడ్డి తెలిపారు.

నేత్రపర్వంగా రావణసేవ