బ్యారేజీలకు గండం.. జనావాసాలకు పెను ముప్పు | - | Sakshi
Sakshi News home page

బ్యారేజీలకు గండం.. జనావాసాలకు పెను ముప్పు

May 24 2025 12:10 AM | Updated on May 24 2025 12:10 AM

బ్యార

బ్యారేజీలకు గండం.. జనావాసాలకు పెను ముప్పు

ప్రజా అవసరాల పేరుతో పర్యావరణానికి తూట్లు పొడుస్తూ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. నదిలో కేవలం డ్రెడ్జింగ్‌ విధానంతోనే ఇసుకను తోడాలని అధికారులు అనుమతులిస్తే టెండర్లలో పొందుపరిచిన నిబంధనలను తుంగలో తొక్కేసి కాంట్రాక్టర్లు పడవలను పక్కన పెట్టేసి భారీ యంత్రాలను నదిలోకి దింపి ఇసుకను తోడేస్తున్నారు. ప్రధానంగా సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు పెన్నా నదిని కుళ్లపోడుస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి అండతో తమ్ముళ్లు బరితెగిస్తున్నా.. అఽధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సూరాయపాళెం పెన్నానదిలో డ్రెడ్జింగ్‌ ముసుగులో జరిగే ఈ ఇసుక దందాలో నిత్యం రూ.లక్షల తమ్ముళ్ల జేబుల్లోకి వెళ్తున్నాయి. సూరాయపాళెం రీచ్‌–2 సంగం బ్యారేజీకు సమీపంలోనే గ్రామానికి వెళ్లే దారిలో ఇష్టానుసారంగా పాత, కొత్త కరకట్టలను ధ్వంసం చేసి నది గర్భంలోకి రోడ్డును నిర్మించారు. కొత్తగా నిర్మించిన కరకట్ట ఉందనే విషయం కూడా తెలియకుండా రోడ్డును నిర్మించడంపై రైతులు మండి పడుతున్నారు. పాత కరకట్టను తెగ్గొట్టి ఇసుక డంపింగ్‌ యార్డుగా వాడుకోవడం చూస్తే రీచ్‌ కాంట్రాక్టర్లు ఎంతగా బరితెగించారో తెలుస్తుంది. ఇరిగేషన్‌ అధికారులకు ఇలాంటి విషయాలు తెలిసినా పట్టించుకోకపోవడంపై రైతులు ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో మైనింగ్‌ చేశారంటూ తప్పుడు పోలీస్‌ కేసులతో వైఎస్సార్‌సీపీ నేతలను వేధిస్తున్న అధికారులకు టీడీపీ నేతల అక్రమ రవాణా కనిపించడం లేదా? ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ అక్రమ దందా వెలుగులోకి రాకుండా ఏకంగా ప్రైవేట్‌ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని దాదాగిరి చేయిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఇసుక మాఫియాగా అవతరించి.. పర్యావరణాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తూ పెన్నానదిని కుళ్లబొడిచేస్తున్నారు. అధికారం అండతో ఆ పార్టీ నేతలు సాగిస్తున్న ఇసుక దోపిడీకి మైనింగ్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖలు తమవంతు సహకారం అందిస్తున్నాయి. ఇసుక కొరతను అధిగమించడానికి ‘డ్రెడ్జింగ్‌’ విధానం తాత్కాలికమే.. అయినా ఆ పేరుతో శాశ్వతంగా తవ్వకాలు సాగుతున్నాయి. అత్యవసరం పేరుతో ఏడాది కాలంగా ‘డ్రెడ్జింగ్‌’తో ఇసుక దోపిడీకి మైనింగ్‌, ఇరిగేషన్‌ శాఖలు ‘పచ్చ కార్పెట్‌’ పరుస్తున్నాయి. పర్యావరణ హితులు ఎవరైనా ‘నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌’ తలుపు తట్టితే.. మొట్టమొదటగా అనుమతులిచ్చిన మైనింగ్‌, ఇరిగేషన్‌ శాఖలతోపాటు కలెక్టర్‌ సైతం బోనులో నిలబడాల్సిన పరిస్థితులు ఉన్నాయని న్యాయకోవిదులు చెబుతున్నారు.

మాఫియా ధనార్జనకు కళ్లెం పడుతుందని..

నిబంధనల ప్రకారం పెన్నానదిలో ఇసుక తవ్వకాలకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నుంచి పర్యావరణ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించి మైనింగ్‌, జలవనరుల శాఖలు ప్రతిపాదించే రీచ్‌లు, అక్కడ పర్యావరణ పరిస్థితులు, ఇసుక నిల్వలపై ఎన్‌జీటీకి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మేరకు అక్కడ ఎంత మేర ఇసుక తవ్వకాలు చేపట్టాలో నిర్ధారిస్తూ ఎన్‌జీటీ అనుమతిస్తోంది. అయితే అధికార పార్టీకి దాసోహం అయిన మైనింగ్‌, ఇరిగేషన్‌ శాఖలు ఈ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఏడాది కాలంగా ఇసుక దోపిడీకి అండగా నిలుస్తున్నాయి. ఇసుక తవ్వకాలకు సంబంధించి ఎన్‌జీటీకి ప్రతిపాదనలు చేస్తే.. అనుమతి ఉన్న ప్రాంతాల్లోనే ఇసుక తవ్వకాలు చేపట్టాల్సి ఉంటుంది. మాఫియా ధనార్జనకు కళ్లెం పడుతుందని, అందుకే ఇసుక అత్యవసరం పేరుతో ఏడాది కాలంగా డ్రెడ్జింగ్‌ విధానాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. జిల్లాలో పెన్నానది ప్రారంభం సోమశిల నుంచి చివర ఇందుకూరుపేట వరకు అధికారికంగా రెండు చోట్ల పరిమిత స్థాయిలో అనుమతులిస్తే.. అనధికారికంగా ముప్పై ప్రాంతాల్లో రీచ్‌లు ఏర్పాటు చేసి నదిని కుళ్లబొడిచి ఇసుక అక్రమ రవాణాను రేయింబవళ్లు నిర్విఘ్నంగా సాగిస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు సైతం పర్యావరణ అనుమతులు లేకుండా ఎక్కడా ఇసుక తవ్వకాలు చేయకూడదని స్పష్టం చేసింది. సుప్రీం ఆదేశాల నేపథ్యం తర్వాత కూడా సంబంధిత మైనింగ్‌, ఇరిగేషన్‌ శాఖలు, జిల్లా అధికార యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదని పర్యావరణ హితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సూరాయపాళెం వద్ద పెన్నానది పాత కరకట్ట

ధ్వంసం (ఇన్‌సెట్లో) పెన్నానది మ్యాప్‌

పెన్నానదిపై కొత్తగా నిర్మించిన సంగం, నెల్లూరు బ్యారేజీలకు డ్రెడ్జింగ్‌ పేరుతో సాగిస్తున్న ఇసుక దోపిడీతో గండం పొంచి ఉందని జలవనరుల నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా నెల్లూరు బ్యారేజీతోపాటు పెన్నానదిపై ఉన్న చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారి వంతెనలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందంటున్నారు. పెన్నానదిలో సూరాయపాళెం, పోతిరెడ్డిపాళెం వద్ద అధికార యంత్రాంగం డ్రెడ్జింగ్‌కు అనుమతులిచ్చింది. పోతిరెడ్డిపాళెం వద్ద విచ్చలవిడిగా అనుమతి ఇచ్చిన ఇసుక తవ్వకాలకు మించి వంద రెట్లు ఇసుకను తోడేశారు. ఈ పరిణామంతో నెల్లూరు బ్యారేజీకి ప్రమాదం ముప్పు తప్పేటట్లు లేదు. ఇక భగత్‌సింగ్‌నగర్‌ ప్రాంతంలోనూ సాగిస్తున్న ఇసుక తవ్వకాలతో చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారి వంతెన ప్రమాదంలో పడుతుందని చెబుతున్నారు. అదే విధంగా సూరాయపాళెం వద్ద ఇసుక తోడేందుకు ఇచ్చిన అనుమతి కంటే.. ఇప్పటికే మూడొందల రెట్లు ఇసుకను తోడేసినట్లు సమాచారం. ఇక్కడి పరిస్థితులతో సంగం బ్యారేజీకి ప్రమాదఘంటికలు ఉన్నాయని.. ఆ ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేసినట్లుగానే జలవనరుల నిపుణులు కూడా అదే జరుగుతుందని విస్పష్టం చేస్తున్నారు. దీంతోపాటు ఎక్కడికక్కడ అనధికార ఇసుక రీచ్‌లు దాదాపు 30 వరకు ఉన్నాయి. నది నుంచి ఇసుకను తరలించేందుకు పెన్నానదిలోకి ఇరువైపులా పొర్లుకట్టలను ధ్వంసం చేసి దర్జాగా రహదారులు ఏర్పాటు చేశారు. తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సోమశిలకు వరద పోటెత్తితే.. అనివార్యంగా పెన్నానదికి వరద నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే పెన్నానది పరీవాహక ప్రాంతాల్లోని జనావాసాలకు పెను ముప్పు తప్పదని జలవనరుల శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

బ్యారేజీలకు గండం.. జనావాసాలకు పెను ముప్పు 1
1/2

బ్యారేజీలకు గండం.. జనావాసాలకు పెను ముప్పు

బ్యారేజీలకు గండం.. జనావాసాలకు పెను ముప్పు 2
2/2

బ్యారేజీలకు గండం.. జనావాసాలకు పెను ముప్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement