
కూటమి పాలనలో ప్రజాస్యామ్యం ఖూనీ
కావలి (జలదంకి): రాష్ట్రంలో కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, అక్రమ కేసులకు వైఎస్సార్‌సీపీ భయపడే ప్రసక్తే లేదని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన కావలి రెండో పట్టణ పోలీసుల విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. విచారణ అనంతరం ప్రతాప్‌కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎప్పుడో ముగిసిన ఫైలాన్ కేసును రీ ఓపెన్ చేసి తనతోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులపై, గతంలో, ప్రస్తుతం టీడీపీ అరాచకాలను ఎండగడుతున్న జర్నలిస్టులతో కలిసి మొత్తం 13 మందిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. ఫైలాన్ కూల్చారని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారనే ఆరోపణలతో అక్రమ కేసులు పెడితే భయపడేది లేదన్నారు. తనను పోలీసులు ఆరు గంటల పాటు విచారించారని, వారు అడిగిన 42 ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. గతంలో జర్నలిస్టులు ప్రెస్‌క్లబ్ కావాలని కోరడంతో ప్రభుత్వ స్థలంలో కట్టించి ఇస్తానని చెప్పానన్నారు. అయితే ఆ సమయంలో అన్నా క్యాంటీన్ మూసివేసి ఉండడంతో అక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పానన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే దిశగా ఎప్పుడూ వైఎస్సార్‌సీపీ వ్యవహరించలేదన్నారు. కుట్ర పూరితంగా కేసును బనాయించారని, దీనికి భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, ప్రజాస్యామ్యాన్ని హరించే దిశగా కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలకు తెగబడిందన్నారు. టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమ మైనింగ్, మట్టి, ఇసుక, రేషన్ మాఫియాల అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు. కావలి నియోజకవర్గం ప్రజలకు తాను ఎల్లప్పుడూ విధేయుడినని, వారి ఆశీర్వాదంతో తాను ఎప్పుడూ వారికి సేవ చేస్తానని తెలిపారు.
అక్రమ కేసులకు భయపడేది లేదు
కావలి మాజీ ఎమ్మెల్యే
రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి