
పేదల విషయంలో ఎందుకు స్పందించలేదు?
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నిర్మల
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ‘బర్మాషెల్‌గుంటలో పేదలు ఇళ్లను ఖాళీ చేయాలని చెప్పినప్పుడు నారాయణ స్పందించలేదు. వారు ఎక్కడికి వెళ్తారనే ఆలోచన ఎందుకు చేయలేదు?, వైఎస్సార్‌సీపీ నగర ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కలెక్టర్‌ను కలిసి పేదలకు కొంత సమయం ఇప్పించారు’ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లి నిర్మల అన్నారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పేదలను ఇళ్లు ఖాళీ చేయించడంలో నారాయణ పెట్టిన శ్రద్ధ పెద్దలు ఆక్రమించిన భూములు స్వాధీనం చేసుకోవడంలో చూపలేదన్నారు. ఇసుక అక్రమ రవాణాను పట్టిస్తే ప్రైజ్‌మనీ ఇస్తానని బహిరంగంగా ప్రకటించారన్నారు. దానికి స్పందించి పట్టించిన నాయకుడికి ఇంతవరకు మీరు ప్రైజ్‌మనీ ఇవ్వలేదన్నారు. ఇసుక వ్యవహారంలో ఎంత దోచుకున్నారో, ఎవరికి ఎంత పంచి పెడుతున్నారో ప్రజలకు తెలియజేయాలన్నారు. దేవస్థాన భూముల కబ్జా చేస్తున్నవారిని అడ్డుకోవాలని టీడీపీ నాయకులే మీడియా ముఖంగా చెబుతున్నా దిక్కు లేకుండా పోయిందన్నారు. ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకోకపోతే వైఎస్సార్‌సీపీ తరఫున మీడియాను తీసుకెళ్లి చూపిస్తామన్నారు. మోసపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని నెరవేర్చే విషయంలో ఏ మాత్రం శ్రద్ధ చూపడం లేదన్నారు.