
మండుటెండలో యోగాసనాలు వేసి..
● 26వ రోజుకు చేరుకున్న సీహెచ్‌ఓల సమ్మె
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోవడంతో జిల్లాలోని సీహెచ్‌ఓలు శుక్రవారం నెల్లూరులోని వైద్యశాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డుపై మండుటెండలో యోగాసనాలు వేసి నిరసన తెలిపారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వారు చేస్తున్న సమ్మె 26వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీహెచ్‌ఓల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రుబేకా మాట్లాడుతూ సీహెచ్‌సీల్లో 95 శాతానికి పైగా మహిళలున్నట్లు చెప్పారు. వారిని రోడ్డుపై నిలబడేలా చేయడం అన్యాయమన్నారు. ఆయుష్మాన్ భారత్‌లోని ఇతర యాప్‌ల్లో తాము పనిచేసిన వివరాలను ఆన్‌లైన్ చేసినా అధికారులు పనిచేయలేదన్నట్టు వేధించడం సరికాదన్నారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తమకు నిర్దిష్ట జాబ్ చార్ట్ ప్రకటించాలన్నారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతనాలు పెంచాలని కోరారు. పీఎఫ్‌ను పునరుద్ధరించాలని, పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలన్నారు. ఇప్పటికై నా సమస్యలు పరిష్కరించాలని లేకుంటే సమ్మెను ఆపే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ భానుమహేష్, కో–ఆర్డినేటర్ ఆదిల్, మాబ్‌జాన్, హెప్సిబా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
రోడ్డుపై యోగాసనాలు వేసిన సీహెచ్‌ఓలు