
జిల్లాలో యోగాంధ్ర ప్రారంభం
నెల్లూరు రూరల్: వచ్చే నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెలరోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని అన్ని ప్రధాన పార్కులతోపాటు జిల్లాలోని వివిధ పట్టణాల్లోని పార్కులు, మండల కేంద్రాల్లో యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఔత్సాహికులు సచివాలయ పరిధిలో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ సైతం రూపొందించామన్నారు. అందరూ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సచివాలయ ఉద్యోగులు అవగాహన కలిగించాలన్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు యోగా అవసరాన్ని యువత గుర్తించాలన్నారు. యోగా సాధనకు హాజరై సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు.