జర్నలిస్టుల అరెస్ట్ ప్రజాస్వామ్యానికి విఘాతం
● అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆర్‌పీఐ
నల్ల రిబ్బన్లతో నిరసన
నెల్లూరు రూరల్/ నెల్లూరు సిటీ: జర్నలిస్టులను అన్యాయంగా అరెస్ట్ చేసి జైలుకు పంపడం ప్రజాస్వామ్యానికి విఘాతమని రిపబ్లిక్ పార్టీ ఇండియా (ఆర్‌పీఐ) నాయకులు ఖండించారు. జర్నలిస్టుల అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ వీఆర్‌సీ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆర్‌పీఐ నాయకులు చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకొని ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌పీఐ జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే మాబు మాట్లాడుతూ కావలికి చెందిన నలుగురు విలేకరులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అంటే ప్రజల గొంతును నొక్కేయడమేనన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని జర్నలిస్టుల మీద దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం ఆనవాయితీగా మారిందన్నారు. ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజా, ప్రభుత్వ ధనాన్ని, సహజ వనరులను దోచుకోవడాన్ని జర్నలిస్టులు ఎక్కడికక్కడ ఎండ కడుతూ అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వ అధికారులకు వారధిగా ఉంటారన్నారు. జర్నలిస్టులు ఎక్కడ ఏ ఘటనలు జరిగిన వాళ్ల ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడ వాస్తవాలు తెలుసుకుంటారే తప్ప ఆయా ఘటనలకు వారికి ఏ సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. కావలికి చెందిన విలేకరుల అరెస్ట్ ముమ్మాటికి రాజకీయ కక్షేనని అన్నారు. ప్రజాప్రతినిధులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని కక్ష సాధింపులకు పాల్పడితే ఆర్‌పీఐ జర్నలిస్టుల పక్షాన పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరికొండ సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టపు రంగారావు, జిల్లా ఉపాధ్యక్షుడు దుంపల సుబ్బారావు, బత్తల మధుసూదన్, జిల్లా కార్యదర్శి వజ్జా సుధాకర్, దాసరి దుర్గాప్రసాద్, హరి, నిమ్మల సుబ్బయ్య, కంచి అశోక్, అచిత్, రాజా, యూత్ జిల్లా అధ్యక్షుడు ముసలి జయరాజ్, ప్రశాంత్, మీడియా ఇన్‌చార్జి బెల్లంకొండ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.


