కోళ్ల వ్యర్థాలపై నిషేధమేదీ..? | - | Sakshi
Sakshi News home page

కోళ్ల వ్యర్థాలపై నిషేధమేదీ..?

Feb 22 2024 12:06 AM | Updated on Feb 22 2024 5:51 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కరోనా తర్వాత ప్రజలను భయపెడుతున్న ప్రాణాంతక వైరస్‌ బర్డ్‌ ఫ్లూ. కేరళను కొంత కాలం వణికించిన బర్డ్‌ ఫ్లూ ఇప్పుడు జిల్లా వాసులనూ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ తరుణంలో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. జిల్లాలో కోళ్లు, చికెన్‌ విక్రయాలను కొద్ది రోజుల పాటు నిషేధించింది. అయితే కోళ్ల వ్యర్థాల కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.

చేపలకు ఆహారంగా కోళ్ల వ్యర్థాలు
జిల్లాలోని కోవూరు, ఇందుకూరుపేట, విడవలూరు, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, బుచ్చిరెడ్డిపాళెం, సంగం మండలాల్లో రెండు వేల ఎకరాల్లో చేపల పెంపకాన్ని సాగిస్తున్నారు. వీటికి వినియోగించే ఫీడ్‌ ఖరీదు కావడంతో పోషణ రైతులకు భారంగా మారింది. సాధారణంగా చేపలు కిలోకుపైగా పెరిగేందుకు ఆర్నెల్ల నుంచి ఎనిమిది నెలలు పడుతుంది. రైతుల నుంచి చేపలను కిలోను రూ.80 నుంచి రూ.90కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి. ఈ తరుణంలో కోళ్ల మేతగా బ్రాండెడ్‌ ఫీడ్‌కు ప్రత్యామ్నాయంగా కోళ్ల వ్యర్థాలను ఆహారంగా వినియోగిస్తున్నారు. వీటితో నాలుగు నెలలకే కిలోకుపైగా బరువు పెరుగుతున్నాయి. దీంతో జిల్లాలో దాదాపు 80 శాతం మంది చేపల రైతులు కోళ్ల వ్యర్థాలనే వినియోగిస్తున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాల నుంచి కోళ్ల వ్యర్థాలను జిల్లాకు తీసుకొచ్చి విక్రయించే మాఫియా తయారైంది. అక్కడ కిలో ఐదారు రూపాయలకు కొనుగోలు చేసి ఇక్కడ రూ.15కు విక్రయిస్తున్నారు.

నిషేధిత వ్యర్థాలు జిల్లాలో డంప్‌
కోళ్ల వ్యర్థాలను చేపలు, రొయ్యలకు మేతగా వేయడాన్ని నిషేధిస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్రం గతేడాది ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను ధిక్కరించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించినా, అనేక రాష్ట్రాల్లో అమలు కావడం లేదు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కోళ్ల వ్యర్థాలను నిషేధించడంతో వాటిని ప్రధానంగా జిల్లాకు నిత్యం టన్నుల్లో తీసుకొచ్చి డంప్‌ చేస్తున్నారు. తమిళనాడు నుంచి తడ మీదుగా.. కేరళ, కర్ణాటక నుంచి నాయుడుపేట మీదుగా జిల్లాకు తరలిస్తున్నారు. వ్యర్థాలు కుళ్లి దుర్గంధం వెదజల్లుతున్నా, ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో పెట్టి వాహనాల్లో రాత్రి వేళ తరలిస్తున్నారు. సదరు వాహనాలు వెళ్లినంత దూరం పావు గంట పాటు దుర్గంధం తగ్గడంలేదు.

నెలకు రూ.లక్షల్లో మామూళ్లు
వీటిని కట్టడి చేయడంలో పోలీసులు, మత్స్యశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వీరికి నెలకు రూ.లక్షల్లో మామూళ్లు ముట్టజెప్తున్నారని సమాచారం. సరిహద్దు ప్రాంతం నుంచి డంప్‌ చేసే ప్రాంతం వరకు ఈ వ్యవహారం జరుగుతోందని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాలు, వాహనం పాడైన సందర్భాల్లో వ్యర్థాల రవాణా వెలుగులోకి వస్తోంది.

నిత్యం వంద టన్నులకుపైగా రవాణా
తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి నిత్యం సుమారు వంద టన్నులకు పైగా కోళ్ల వ్యర్థాలను రవాణా చేస్తున్నారని సమాచారం. రాత్రి బయల్దేరి తెల్లారేసరికి చేపల గుంతల వద్దకు ఈ వాహనాలు చేరుకుంటున్నాయి. వీటిని వేగంగా రవాణా చేసేందుకు ప్రత్యేక వాహనాలను వినియోగిస్తున్నారు. తమిళనాడు నుంచి 15 – 20, కేరళ నుంచి 10, కర్ణాటక నుంచి 10 – 15 వాహనాల్లో వీటిని నిత్యం రవాణా చేస్తున్నారని సమాచారం. ఒక్కో వాహనంలో ఐదు నుంచి పది టన్నుల వరకు తరలిస్తున్నారు.

కోళ్ల వ్యర్థాల తరలింపు వాహనాలు1
1/1

కోళ్ల వ్యర్థాల తరలింపు వాహనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement