
వేగం రాక్షసమై.. క్షణం నిశ్శబ్దమై..
భీతావహ పరిస్థితి
కుటుంబాన్ని
కబళించిన అతివేగం
● భార్యాభర్తలతో ఓ కుమార్తె దుర్మరణం
● తీవ్రగాయాలతో అనాథగా
మిగిలిన చిన్న కుమార్తె
రోడ్డుపై రాక్షసం.. మమతల బంధాన్ని మింగేసింది. రోడ్డుపై చెల్లా చెదురుగా పడి ఉన్న తల్లి, తండ్రి, బిడ్డ మృతదేహాలు. లారీ ఈడ్చుకుపోవడంతో నుజ్జైన శరీర భాగాలు. పక్కనే గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారి. మృతదేహాల పక్కనే చిన్నారుల తినుబండారాలు, పెన్ను చూసిన ప్రతి ఒక్కరి గుండె బరువెక్కింది. ఆ దృశ్యం భీతావహంగా మారింది. ఒక్క క్షణంలోనే.. ఓ కుటుంబం చిదిమిపోయింది. అతివేగం ఆ ప్రాణాలను కబళించింది. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. బంధువుల వివాహానికి వచ్చి, తిరిగి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
కలిగిరి: భార్య, భర్త, ఇద్దరు బిడ్డలు. ఉన్నంతలో ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని విధి వేటాడింది. మరి కొద్ది సేపట్లో ఇంటికి చేరుతారనే సమయంలో మితిమీరిన వేగంతో ఎదురుగా రాంగ్‌రూట్‌లో దూసుకొచ్చిన బోర్‌వెల్ లారీ ముగ్గురిని కబళించింది. ఇంటికి సరుకులు, చిన్నారులకు తినుబండారాలు తీసుకుని బైక్‌పై వెళ్తున్నారు. మండలంలోని తూర్పుదూబగుంట ఎస్సీ కాలనీకి చెందిన చవలముడి బాబు (30) బతుకుదెరువు నిమిత్తం భవన నిర్మాణ పనులు చేస్తూ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బంధువుల వివాహం ఉండడంతో గత నెలలో స్వగ్రామానికి వచ్చాడు. మళ్లీ పనులకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సరుకులు కొనేందుకు భార్య మమత (27), పెద్ద కుమార్తె వైభ (6), చిన్న కుమార్తె మేఘనతో కలిసి బైక్‌పై కలిగిరికి వెళ్లి తిరిగి స్వగ్రామం వెళ్తున్నాడు. కుడుములదిన్నెపాడులోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ప్రధాన రహదారిపై ఎదురుగా వచ్చిన బోర్ వైల్స్ లారీ రాంగ్‌రూట్‌లో బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై నుంచి జారి కింద పడడంతో లారీ చక్రాలు వారిని ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో దంపతులు బాబు, మమత, పెద్ద కుమార్తె వైభ అక్కడికక్కడే మృతి చెందారు. చిన్న కుమార్తె మేఘన తీవ్రంగా గాయపడింది.
కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రమాద స్థలాన్ని ఉదయగిరి సీఐ వెంకటరావు, వింజమూరు ఎస్సై వీరాప్రతాప్, కలిగిరి ఏఎస్సై రామచంద్రయ్య సందర్శించారు. మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన బోర్‌వెల్స్ లారీ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భీతావహంగా ఉన్న ఘటనా స్థలం
ఒకే స్ట్రెచర్‌పై తల్లికుమార్తె మమత, వైభ మృతదేహాలు
లారీ ఈడ్చుకెళ్లడంతో మృతుల శరీర భాగాలు నుజ్జునుజ్జు కావడతో భీతావహ పరిస్థితి నెలకొంది. తీవ్రంగా గాయపడిన చిన్నారి మేఘనను 108 వాహనంలో కావలికి తరలించారు. బాబు ఇంటికి తీసుకెళ్తున్న నిత్యావసర సరుకులు, చిన్నారుల తినుబండరాలు మృతదేహాల పక్కనే పడి ఉన్నాయి. ప్రమాదం విషయం తెలుసుకుని తూర్పుదూబగుంట నుంచి మృతుల బంధువులు, గ్రామస్తులు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలు పడి ఉన్న తీరు చూసి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కలిచి వేసింది. చిన్నారి వైభ మృతదేహం పక్కనే పెన్ను పడి ఉండడం చూసి బంధువులు రోదించారు. పోస్టుమార్టం నిమిత్తం ఒకే స్ట్రెచర్‌పై తల్లి, కుమార్తె మృతదేహాలను అంబులెన్స్‌లో తరలించడం హృదయవిధారకంగా కనిపించింది.

వేగం రాక్షసమై.. క్షణం నిశ్శబ్దమై..

వేగం రాక్షసమై.. క్షణం నిశ్శబ్దమై..