
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (జులై 30) తొలి టెస్ట్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ ధాటికి 149 పరుగులకే ఆలౌటైంది.
హెన్రీ నిప్పులు చెరిగే బంతులతో జింబాబ్వే ప్లేయర్ల భరతం పట్టాడు. 15.3 ఓవర్లలో కేవలం 39 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. అతనితో పాటు మరో పేసర్ నాథన్ స్మిత్ (14-8-20-3) కూడా చెలరేగడంతో జింబాబ్వే ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది.
జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (39) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వికెట్‌కీపర్ సిగా (30), నిక్ వెల్చ్ (27), బెన్ కర్రన్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మ్యాట్ హెన్రీకి 30 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్‌లో ఇది ఐదో 5 వికెట్ల ప్రదర్శన.
హెన్రీ ఇటీవలికాలంలో ఫార్మాట్లకతీతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుత పేసర్లలో బుమ్రా, హాజిల్‌వుడ్ మాత్రమే ఇది సాధ్యమవుతుంది. హెన్నీ 30 టెస్ట్‌ల్లో 126 వికెట్లు, 91 వన్డేల్లో 165 వికెట్లు, 25 టీ20ల్లో 37 వికెట్లు తీశాడు. హెన్రీ అడపాదడపా బ్యాట్‌తోనూ సత్తా చాటగలడు. ఇతని పేరిట టెస్ట్‌ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
ఇదిలా ఉంటే, ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్ జింబాబ్వేలోనే ముక్కోణపు టీ20 సిరీస్ ఆడింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్‌తో పాటు సౌతాఫ్రికా కూడా పాల్గొంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా ఛాంపియన్‌గా నిలిచింది.
ఫైనల్లో సౌతాఫ్రికాతో జరిగిన క్లోజ్ ఫైట్‌లో 3 పరుగుల తేడాతో గెలుపొందింది విజేతగా అవతరించింది. ఫైనల్ సహా అన్ని మ్యాచ్‌ల్లో రాణించిన మ్యాట్ హెన్రీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ అవార్డులు దక్కాయి.