ధోని...ధోని.. క్రికెట్ జ్ఞాని

Your Always Be My Captain Says Virat Kohli - Sakshi

ప్రస్తుత భారత కీలక ఆటగాళ్లంతా ధోని సారథ్యంలోనే రాటుదేలారు. వారి ప్రతిభను గుర్తించిన మహి విరివిగా అవకాశాలిచ్చాడు. భవిష్యత్‌ టీమిండియా కూడా పటిష్ట జట్టుగా రూపు దిద్దుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అందుకే మహి అంటే కోహ్లి, రోహిత్, రైనా తదితరులకు గుండె నిండా అభిమానమే. వీడ్కోలు పలికిన తమ గ్రేటెస్ట్‌ స్టార్‌కు వీరంతా ఇప్పుడు శుభాకాంక్షలు తెలిపారు.

ఆల్‌ ద బెస్ట్‌ ధోని : ఐసీసీ
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అభినందనలు తెలిపింది. ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మను సాహ్నీ మాట్లాడుడూ అతని విజయవంతమైన కెరీర్‌ను కీర్తించారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు. ‘ఆల్‌టైమ్‌ గ్రేటెస్ట్‌ క్రికెటర్లలో ఎమ్మెస్‌ ధోని ఒకడు. 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో వాంఖడేలో సిక్సర్‌తో మెగా ఈవెంట్‌ను ముగించిన చిత్రం ప్రపంచ క్రికెట్‌ అభిమానుల మనస్సుల్లో చిరకాలం ముద్రించుకొనే ఉంటుంది. ఈ తరానికి అతనొక స్ఫూర్తి ప్రదాత. ధోని అద్భుతమైన కెరీర్‌కు ఐసీసీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నా’ అని అన్నారు.

నాకు తెలుసు... నీ కళ్లు చెమ్మరిళ్లే ఉంటాయని!
‘ఆటకు అత్యుత్తమ సేవలందించిన నీకు అభినందనలు. నీ కెరీర్‌లో నీవు సాధించిన దానిపట్ల గర్వంగా ఉండాలి. నీ విజయాలు... వ్యక్తిత్వం... చూస్తుంటే నాకెంతో గర్వంగా వుంది. నాకు తెలుసు... నీకెంతో ఇష్టమైన ఆటకు వీడ్కోలు చెబుతుంటే నీ కళ్లు చెమ్మరిల్లే ఉంటాయని నాకు తెలుసు. ఇక నీవు ఆరోగ్యంగా, సంతోషంగా జీవితంలో ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని పోస్ట్‌ చేసిన సాక్షి... అమెరికా రచయిత ఎంజెలో వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా పేర్కొంది. నీవేం చెప్పావో... నీవేం చేశావో ప్రజలు మర్చిపోవచ్చు. కానీ నీవు వాళ్లని అలరించిన తీరును మాత్రం ఎప్పటికీ మరచిపోరు’ అని ఎంజెలో మాటల్ని ఉటంకించింది.

ఆ రికార్డు ఎప్పటికీ చెక్కుచెదరదు 
భారత క్రికెట్‌ జట్టు మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ మహేంద్ర సింగ్‌ ధోనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. సారథిగా ధోని సాధించిన మూడు ఐసీసీ ట్రోఫీల రికార్డును మరో కెప్టెన్‌ సాధించడం కష్టమని గంభీర్‌ వ్యాఖ్యానించాడు. ధోని రిటైర్మెంట్‌పై ఒక స్పోర్ట్స్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో మాట్లాడిన గంభీర్‌... ‘ ఐసీసీకి సంబంధించిన మూడు ట్రోఫీలను ధోని సాధించాడు. ఆ రికార్డు ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటుంది. మరో కెప్టెన్‌ ఇలాంటి ఘనతను సాధిస్తాడని కూడా నేను అనుకోవడం లేదు. దీనిపై పందెం కాయడానికి కూడా నేను సిద్ధమే’ అని పేర్కొన్నాడు.

2007లో జరిగిన తొలి టి20 ప్రపంచ కప్‌ను భారత్‌కు అందించిన ధోని... తర్వాత 2011లో భారతీయుల 26 ఏళ్ల ప్రపంచ కప్‌ కలను సాకారం చేస్తూ వన్డే ప్రపంచ కప్‌ను సాధించి పెట్టాడు. 2013లో చాంపియన్స్‌ ట్రోఫీని కూడా గెలిచి ఐసీసీకి సంబందించిన మూడు ట్రోఫీలను నెగ్గిన తొలి సారథిగా ధోని నిలిచాడు. ధోని సార«థ్యంలో భారత్‌ గెలిచిన టి20, వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్లో గంభీర్‌ తనవంతు పాత్ర పోషించాడు. వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్లో ధోనితో కలిసి 109 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అంతే కాకుండా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ను అగ్రస్థానంలో కూడా నిలపడం ధోనికే సాధ్యం అయింది.  

వీడ్కోలు మ్యాచ్‌ ఉండదు 
ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మేటి క్రికెటర్‌ ఎమ్మెస్‌ ధోని కోసం ప్రత్యేక వీడ్కోలు మ్యాచ్‌ నిర్వహించే ప్రశ్నే ఉత్పన్నం కాదని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మాజీ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా స్పష్టం చేశారు. తన 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు 39 ఏళ్ల ధోని శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ధోని ఘనతలకు గుర్తింపుగా అతనికి ప్రత్యేక వీడ్కోలు మ్యాచ్‌ ఏర్పాటు చేయాలని... దానికి అతని స్వరాష్ట్రం జార్ఖండ్‌లోని రాంచీ స్టేడియం ఆతిథ్యమిస్తుందని జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి విన్నవించారు. అయితే తనకు ప్రత్యేక వీడ్కోలు మ్యాచ్‌ ఏర్పాటు చేయాలని బీసీసీఐని ధోని కోరలేదని... అందుకే అతని కోసం ప్రత్యేక ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ నిర్వహించే అవకాశం లేదని రాజీవ్‌ శుక్లా వివరించారు.

ఎప్పటికీ నువ్వే నా కెప్టెన్‌ 
తన 16 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌కు శనివారం వీడ్కోలు పలికిన క్రికెటర్‌ ఎమ్మెస్‌ ధోనిపై భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన గౌరవాన్ని చాటుకున్నాడు. రిటైర్మెంట్‌ కారణంగా జాతీయ జట్టు తరఫున ఇక ధోని బరిలోకి దిగే అవకాశం లేకపోయినా... ఎప్పటికీ తన మనసులో కెప్టెన్‌గా ధోనియే ఉంటాడని కోహ్లి ఆదివారం బీసీసీఐ ద్వారా విడుదల చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ‘గతంలోనూ చెప్పేవాణ్ని... ఇప్పుడూ చెబుతున్నా... ఎప్పటికీ నువ్వే నా కెప్టెన్‌వి. జీవితంలోని కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడాలో తెలియదు.

ఇప్పుడూ అలాంటి సందర్భమే వచ్చింది. టీమ్‌ బస్‌లో ఎల్లప్పుడూ చివరి సీటులో కూర్చున్న ఏకైక వ్యక్తివి నువ్వే. మనద్దరి మధ్య స్నేహం, సమన్వయం ఎంతో ఉంది. ఎందుకంటే జట్టు విజయం కోసం ఇద్దరం ఒకే లక్ష్యంతో పోరాడేవాళ్లం’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నా... 39 ఏళ్ల ధోని వచ్చేనెల 19న యూఏఈలో మొదలయ్యే ఐపీఎల్‌ టి20 టోర్నమెంట్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ముందుకు నడిపించనున్నాడు.

‘భారత క్రికెట్లోనే అత్యంత ప్రభావంతమైన ఆటగాడు ధోని. ఆటలో బాటలో అతని మార్గదర్శనం మమ్మల్ని నడిపించింది. దూరదృష్టి గల ఈ నాయకుడికి భవిష్యత్‌ అవసరాల కోసం జట్టును ఎలా నిర్మించాలా బాగా తెలుసు. ఇంతటి మేటి క్రికెటర్‌తో బ్లూ జెర్సీలో కలిసి ఆడకపోయినా... యెల్లో జెర్సీలో ప్రత్యర్థిగా పోటీ పడేఅవకాశముంది. కెప్టెన్‌... 19న ముంబై, చెన్నైల మధ్య జరిగే మ్యాచ్‌లో టాస్‌ దగ్గర కలుద్దాం’ – రోహిత్‌ శర్మ 

‘మిస్టర్‌ కూల్‌’ గరం గరం 
ధోని అంటే ‘బెస్ట్‌ ఫినిషర్‌’, ‘మిస్టర్‌ కూల్‌’, ‘మేధావి కెప్టెన్‌’... అతని సుదీర్ఘ కెరీర్‌ ఇవే ఎక్కువగా గుర్తుకొస్తాయి. కానీ ఈ డీఆర్‌ఎస్‌ దిట్టకు ఒకసారి ఆపుకోలేనంత కోపమొచ్చింది ఐపీఎల్‌లో. అందుకే గీత దాటాడు. మిన్నువిరిగి మీద పడ్డా... అచంచల విశ్వాసంతో, నింపాదిగా ఉండే ధోని గత లీగ్‌లో ఏకంగా మైదానంలోకి చొచ్చుకొచ్చాడు. ఫీల్డు అంపైర్లతో వాదించాడు. రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా స్టోక్స్‌ చివరి ఓవర్‌లో ఫుల్‌టాస్‌ బంతిని అంపైర్‌ నోబాల్‌గా ప్రకటించి అప్పుడే సవరించుకున్నాడు. వెంటనే ధోని ఇదేంటని కల్పించుకున్నాడు. అంపైర్లతో ఎన్నడూ లేని విధంగా వాదనకు దిగాడు. తదనంతరం ధోని మ్యాచ్‌ ఫీజులో కోతకు గురయ్యాడు. అప్పటి సంఘటనను అంపైర్‌ గాంధీ గుర్తుచేసుకున్నాడు. అప్పుడు అంపైరింగ్‌ తప్పు... ధోనిదీ తప్పు అని అన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top