మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) ఇవాళ (అక్టోబర్ 30) భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరుగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగే ఈ నాకౌట్ సమరం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాను వరుణుడు పరీక్షించబోతున్నాడు.
ఈ మ్యాచ్‌కు వాతావరణం అడ్డంకిగా మారే అవకాశం ఉంది. AccuWeather నివేదిక ప్రకారం, DY పాటిల్ స్టేడియం పరిసరాల్లో ఇవాళ ఉదయం ఆకాశం 93 శాతం మేఘావృతంగా ఉంటుంది. 25 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది.
మ్యాచ్ సమయానికి పరిస్థితులు మెరుగవుతాయన్న అంచనా ఉన్నా, నవీ ముంబైలో వాతావరణ పరిస్థితులను నమ్మడానికి వీల్లేదు. ఈనెల 28న ఇక్కడ జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌ను కూడా వర్షం ముంచేస్తుందేమోనని భారత క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
మ్యాచ్ పూర్తిగా రద్దైతే..?
ఒకవేళ నేటి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైనా రిజర్వ్ డే (అక్టోబర్ 31) ఉంది. ఇవాళ కొంత మ్యాచ్ జరిగి ఆగిపోయినా, ఇదే స్థితి నుంచి రిజ్వర్ డేలో కొనసాగుతుంది. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే మాత్రం టీమిండియా కొంప కొల్లేరవుతుంది.
గ్రూప్ దశలో భారత్ కంటే ఎక్కువ పాయింట్లు ఉండటం చేత ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంటుంది. గ్రూప్ దశలో ఆసీస్ 7 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా 13 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. భారత్ 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 7 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.
ఇదిలా ఉంటే, నిన్న (అక్టోబర్ 29) జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (169) రికార్డు శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనలో మారిజన్ కాప్ (7-3-20-5) చెలరేగడంతో ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటై 125 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది.
చదవండి: పెను విషాదం.. ఆస్ట్రేలియా యువ క్రికెటర్ మృతి


