సూర్యకు బైబై!.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?! | Who Can Replace Suryakumar As India Next T20I Captain Top 5 Options | Sakshi
Sakshi News home page

సూర్యకు బైబై!.. భారత టీ20 కెప్టెన్‌.. టాప్‌-5 ప్లేయర్లు వీరే!

Apr 15 2026 7:03 PM | Updated on Apr 15 2026 8:06 PM

Who Can Replace Suryakumar As India Next T20I Captain Top 5 Options

సొంతగడ్డపై టీమిండియాకు ఇటీవల టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ అందించిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. అయితే, అతడి భవితవ్యంపై క్రికెట్‌ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా సారథిగా సూపర్‌ హిట్‌ అవుతున్నా.. బ్యాటర్‌గా మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు.

ఈ నేపథ్యంలో సెలక్టర్లు సైతం సూర్యను కొనసాగించాలా వద్దా? అన్న అంశంపై తీవ్రంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్‌ ముగిసిన వెంటనే జరిగే ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో సిరీస్‌లలో అతడి ప్రదర్శనను పరిశీలించిన అనంతరమే వారు అంతిమ నిర్ణయానికి రానున్నారు.

వచ్చే రెండేళ్లలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్‌ (2028)తో పాటు లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ (2028) జరగనున్నాయి. వీటికి సూర్యకుమార్‌ సారథ్యంలోనే సిద్ధం కావాలా లేక కొత్త నాయకుడిని ఎంపిక చేయాలా అనే విషయంపై సెలక్టర్లు ఐర్లాండ్, ఇంగ్లండ్‌ పర్యటనతో ఒక అవగాహనకు రానున్నారు.

విషమ పరీక్ష
ఈ టూర్‌లో అటు సారథిగా, ఇటు ప్లేయర్‌గా సూర్యకుమార్‌కు విషమ పరీక్ష కానుంది. గౌతమ్‌ గంభీర్‌ 2028 ఒలింపిక్స్‌ వరకు టీమిండియా హెడ్‌కోచ్‌గా కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో... సూర్యకుమార్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం 35వ పడిలో ఉన్న సూర్యకుమార్‌ ఒలింపిక్స్‌ సమయానికి ఫిట్‌గా ఉంటాడా అనేది అనుమానమే.

‘సూర్యకుమార్‌ ప్రస్తుతం జట్టును నడిపిస్తున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్‌ పర్యటనకు అతడే కెప్టెన్‌ అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది అందులో అతడి ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.

గతేడాది పేలవ ఆటతీరు కనబర్చిన సూర్యకుమార్‌ కనీసం ఒక్క హాఫ్‌సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. ఈ ఏడాది ఫర్వాలేదినిపించిన ఈ ముంబైకర్‌... వరల్డ్‌కప్‌ ఆరంభంలో ఆకట్టుకున్నా... కీలక మ్యాచ్‌ల్లో మాత్రం విఫలమయ్యాడు. 

సౌతాఫ్రికాపై 18 పరుగులు, వెస్టిండీస్‌పై 18 పరుగులు, ఇంగ్లండ్‌పై 11 పరుగులు చేసిన సూర్యకుమార్‌... న్యూజిలాండ్‌తో ఫైనల్లో డకౌటయ్యాడు. ఒకవేళ సూర్యను సెలక్టర్లు తప్పిస్తే.. అతడి స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్‌ కాగల అర్హత ఉన్న టాప్‌-5 ఆటగాళ్లు ఎవరో తెలుసా?

శుబ్‌మన్‌ గిల్‌
ఇప్పటికే టీమిండియా టెస్టు, వన్డే పగ్గాలు చేపట్టాడు శుబ్‌మన్‌ గిల్‌. అయితే, టీ20 జట్టు కెప్టెన్సీ విషయంలో మాత్రం బీసీసీఐ గిల్‌ గురించి వెంటనే నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ఆసియా కప్‌-2025తో టీ20 జట్టులో పునరాగమనం చేసిన అతడు వరుసగా విఫలం కావడం ఇందుకు కారణం.

అయితే, ఐపీఎల్‌-2026లో గనుక బ్యాటర్‌గా గిల్‌ సత్తా చాటితే అతడి ఎంపిక లాంఛనమే అవుతుంది. కాగా ఫామ్‌లేమి కారణంగా గిల్‌ను టీ20 ప్రపంచకప్‌-2026 జట్టు నుంచి సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే.

హార్దిక్‌ పాండ్యా
నిజానికి 2024లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత రోహిత్‌ శర్మ అంతర్జాతీయ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత కెప్టెన్‌ కావాల్సింది హార్దిక్‌ పాండ్యానే. అయితే, అనూహ్యంగా యాజమాన్యం సూర్యకు పగ్గాలు అప్పగించింది.

ఆ సమయంలో.. అరుదైన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన హార్దిక్‌ పాండ్యాపై అధిక భారం పడకుండా.. తాము ఈ నిర్ణయం తీసుకున్నటుట్లు చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తెలిపాడు. కాబట్టి సూర్య స్థానంలో హార్దిక్‌ను సారథిగా ఎంపిక చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశం. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అతడికి అనుభవం ఉంది.

సంజూ శాంసన్‌
జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయిన సంజూ శాంసన్‌... టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించి హీరో అయ్యాడు. సూపర్‌-8 నాకౌట్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 97 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ కేరళ వికెట్‌ బ్యాటర్‌.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 రన్స్‌తో దుమ్ములేపాడు.

ఇక ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు సుదీర్ఘకాలం కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం సంజూకు ఉంది. కేరళ జట్టుకు కూడా గతంలో అతడు సారథ్యం వహించాడు.

అక్షర్‌ పటేల్‌
టీ20 వరల్డ్‌కప్‌-2026లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున సారథిగానూ అతడు సత్తా చాటుతున్నాడు. సూర్య వారసుడిగా అక్షర్‌ ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు.

శ్రేయస్‌ అయ్యర్‌
ముంబై సారథిగా, ఐపీఎల్‌లో వివిధ జట్ల కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌కు అపార అనుభవం ఉంది. 2024లో అతడి సారథ్యంలోనే కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టైటిల్‌ గెలిచింది. గతేడాది పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఇరగదీసి ఫైనల్‌కు చేర్చాడు. 

అయితే, 2023 డిసెంబరు తర్వాత ఇంత వరకు అతడు భారత టీ20 జట్టు తరఫున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా త్వరలోనే జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

చదవండి: PSL: అక్కడ వద్దంటేనే ఇక్కడికి: పీసీబీ పరువు తీసిన పాక్‌ క్రికెటర్‌

Advertisement
 
Advertisement
Advertisement