‘బాస్‌ బేబీ’ వైభవ్‌ గురించి కోహ్లి ఏమన్నాడంటే! | What Virat said about Sooryavanshi moments after RCB won IPL 2026 | Sakshi
Sakshi News home page

‘బాస్‌ బేబీ’ వైభవ్‌ సూర్యవంశీ గురించి కోహ్లి ఏమన్నాడంటే!

Jun 1 2026 12:16 PM | Updated on Jun 1 2026 7:47 PM

What Virat said about Sooryavanshi moments after RCB won IPL 2026

వైభవ్‌తో కోహ్లి (PC: jiostar/starsports x)

ఐపీఎల్‌-2026లో వైభవ్‌ సూర్యవంశీ దుమ్ములేపాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా పూర్తిస్థాయిలో బరిలోకి దిగిన ఈ బిహారీ పిల్లాడు.. జట్టు ప్లే ఆఫ్స్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో మొత్తంగా 16 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌ 776 పరుగులు సాధించాడు.

తద్వారా తాజా ఎడిషన్‌లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). అంతేకాదు ఒక సీజన్‌లో అత్యధిక సిక్సర్లు (72) బాదిన ప్లేయర్‌గానూ నిలిచి.. యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.

యూనివర్స్‌ బాస్‌ బేబీ
ఈ క్రమంలో వైభవ్‌ సూర్యవంశీని అభిమానులు ముద్దుగా ‘యూనివర్స్‌ బాస్‌ బేబీ’ అని పిలుచుకుంటున్నారు. ఇక అతడి ఆట తీరుకు టీమిండియా దిగ్గజాలు సునిల్‌ గావస్కర్‌, సచిన్‌ టెండుల్కర్‌.. సౌతాఫ్రికా లెజెండ్‌ ఏబీ డివిలియర్స్‌, విండీస్‌ స్టార్‌ గేల్‌ తదితరులు ఇప్పటికే ఫిదా అయిన సంగతి తెలిసిందే.

తాజాగా... భారత బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం నాటి ఫైనల్లో ఆర్సీబీ ‘కింగ్‌’ కోహ్లి 75 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

వైభవ్‌ సూర్యవంశీతో కోహ్లి ముచ్చట
ఇక అదే సమయంలో వైభవ్‌ సూర్యవంశీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచి.. కింగ్‌ హవాలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ విజయానంతరం కోహ్లి వైభవ్‌ సూర్యవంశీతో కాసేపు ముచ్చటించాడు.

తనకు వినయంగా నమస్కరించిన ‘బేబీ బాస్‌’ భుజం తట్టి.. ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో ‘‘కింగ్‌’.. ‘బేబీ బాస్‌’తో ఏం మాట్లాడాడబ్బా!.. మాకూ తెలిస్తే బాగుండు’ అంటూ అభిమానులు  చర్చించుకుంటున్నారు.

వైభవ్‌ గురించి కోహ్లి ఏమన్నాడంటే!
ఈ నేపథ్యంలో ఆర్సీబీ దిగ్గజం, కామెంటేటర్‌ ఏబీ డివిలియర్స్‌ కోహ్లి.. వైభవ్‌ గురించి తనతో మాట్లాడిన విషయాన్ని బయటపెట్టాడు. ‘‘విరాట్‌ ఏం చెప్పాడోనని మీరంతా తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా!.. వైభవ్‌ ఆరెంజ్‌ క్యాప్‌ అందుకోవడానికి స్టేజీ పైకి వెళ్తుంటే విరాట్‌ నాతో అతడి గురించి మాట్లాడాడు.

‘ఏబీ.. ఈ పిల్లాడు చాలా ప్రత్యేకమైన వాడు. ఈ అబ్బాయి చాలా కాలం క్రికెట్‌ను ఏలగలడు’ అని విరాట్‌ నాతో అన్నాడు’’ అని డివిలియర్స్‌ తెలియజేశాడు. కాగా సచిన్‌ సైతం వైభవ్‌ రిస్ట్‌ వర్క్‌, టెక్నిక్‌ అద్భుతం అంటూ కొనియాడిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఫైనల్‌ వీక్షించేందుకు ఆదివారం అహ్మదాబాద్‌కు వచ్చాడు వైభవ్‌ సూర్యవంశీ. ఐసీసీ చైర్మన్‌ జై షా, టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లాతో కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించాడు.

చదవండి: IPL 2026: వైభవ్‌ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్‌ మనీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement