
ఆసియాకప్-2025కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్-హాంకాంగ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే ఈ మల్టీ నేషనల్ టోర్నమెంట్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దాదాపు ఆరు నెలల తర్వాత క్రికెట్ మైదానంలో చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు.
సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా దాయాదుల పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అధికారిక బ్రాడ్ కాస్టర్ సోన్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. పాకిస్తాన్‌తో తన ఆడిన రోజులను సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. పాక్‌పై ఓడిపోయినా ప్రతీసారి తన అసహనానికి లోనయ్యేవాడని అని అతడు తెలిపాడు.
"పాకిస్తాన్‌పై ఓడిపోయిన ప్రతీసారి నేను కుంగిపోయేవాడిని. ఫలితంగా నా ఏకాగ్రతను కోల్పోయేవాడని. ఆ సమయంలో ప్రతిదీ కోల్పోయినట్లు అన్పించేది" అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
కాగా ఈ నజాఫ్‌గఢ్ నవాబుకు ప్రత్యర్ధి పాకిస్తాన్ అయితే చాలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయేవాడు. ముఖ్యంగా టెస్టుల్లో అయితే పాక్‌కు చుక్కలు చూపించేవాడు. సెహ్వాగ్ తన తొలి ట్రిపుల్ సెంచరీని పాక్ పైనే నమోదు చేశాడు.
2008లో పాకిస్తాన్ టూర్‌లో కరాచీ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్‌లో సెహ్వాగ్ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికి అభిమానులకు గుర్తుండిపోతుంది. 300 పరుగుల టార్గెట్‌ను చేధించే క్రమంలో వీరు సూపర్ సెంచరీతో చెలరేగాడు. 95 బంతుల్లోనే 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 119 పరుగులు సాధించాడు. ఈ సెంచరీ కోసం కూడా తాజా ఇంటర్వ్యూలో వీరేంద్రుడు మాట్లాడాడు.
"కరాచీ వన్డే రోజున నేను ఊపవాసంతో ఉన్నాను. ఖాలీ కడుపుతో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కానీ ఆ మ్యాచ్‌లో పరుగులు సాధించి నా ఆకలిని తీర్చుకున్నాను" అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.