
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు చేదు వార్త. ఈ భారత స్టార్ ద్వయం త్వరలోనే వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించి కెరీర్‌ను ముగిస్తారని సమాచారం.
అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరుగబోయే సిరీసే వీరికి చివరిదని ఓ ప్రముఖ దినపత్రిక తమ కథనంలో పేర్కొంది. రోహిత్, కోహ్లి ఇప్పటికే టీ20లకు, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కొద్ది రోజుల ముందు వరకు రోకో (రోహిత్, కోహ్లి) 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు ఆడతారని ప్రచారం జరిగింది. అయితే తాజా నివేదిక ప్రకారం ఇది తప్పని తెలుస్తుంది. ఒకవేళ రోకో 2027 వరల్డ్‌కప్ ఆడాలని అనుకుంటే డిసెంబర్‌లో జరిగే విజయ్ హజారే ట్రోఫీలో తమను తాము నిరూపించుకోవాలని బీసీసీఐ ఆదేశించిందట.
ఇంగ్లండ్ పర్యటనకు ముందు కూడా బీసీసీఐ రోహిత్, కోహ్లిలకు రంజీల్లో నిరూపించుకోవాలని కండీషన్ పెట్టింది. బోర్డు ఆదేశానుసారం వారు అలా చేసినా, అనూహ్యంగా టెస్ట్‌ల నుంచి తప్పుకున్నారు.
ఇప్పుడు వన్డేల విషయంలోనూ రోకో గతంలో ఎదుర్కొన్న ఛాలెంజ్‌నే ఎదుర్కొంటున్నట్లు తెలుస్తుంది. జట్టులోకి రావాలంటే తప్పక దేశవాలీ టోర్నీల్లో రాణించాల్సి ఉంటుంది.
యువ ఆటగాళ్ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ మేరకు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రోహిత్, కోహ్లి 2027 వరల్డ్ కప్ వరకు ఆడటం అనుమానంగా కనిపిస్తుంది. వీరికి వయసు మీద పడినట్లు స్పష్టంగా తెలుస్తుంది.
ఇటీవల వైరలైన కోహ్లి తెల్ల గడ్డం ఫోటో ఇందుకు నిదర్శనం. పైకి కనిపించకపోయినా కోహ్లి కంటే రోహితే వయోభారం సమస్యలను అధికంగా ఎదుర్కొంటున్నాడు. రోహిత్ విషయానికొస్తే.. బాగా లావైపోయి ఆటకు పనికొస్తాడా అన్నట్లు కనిపిస్తున్నాడు.
టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో వీరు ప్రాక్టీస్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించడం లేదు. కోహ్లి లండన్‌లోనే మకాం వేసి అప్పుడప్పుడు బ్యాట్‌ను తిప్పుతుండగా.. రోహిత్ పూర్తిగా ప్రాక్టీస్ మానేసి కుటుంబంతో జాలీ ట్రిప్‌లు ఎంజాయ్ చేస్తున్నాడు.