మ‌న‌సు మార్చుకోని కోహ్లి.. త్వ‌ర‌లోనే రిటైర్మెంట్‌? | Virat Kohli most likely to confirm retirement: Reports | Sakshi
Sakshi News home page

#Virat Kohli: మ‌న‌సు మార్చుకోని కోహ్లి.. త్వ‌ర‌లోనే రిటైర్మెంట్‌?

May 11 2025 8:04 PM | Updated on May 11 2025 8:53 PM

Virat Kohli most likely to confirm retirement: Reports

టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌కటించేందుకు సిద్ద‌మ‌య్యాడ‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందే టెస్టు క్రికెట్ నుంచి కోహ్లి త‌ప్పుకుంటాడ‌ని, ఇప్ప‌టికే త‌న నిర్ణ‌యాన్ని బీసీసీఐకి తెలియ‌జేసిన‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

ఈ క్ర‌మంలో క‌నీసం ఇంగ్లండ్ సిరీస్ వ‌ర‌కైనా కొన‌సాగేలా కోహ్లిని ఒప్పించేందుకు బీసీసీఐ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. చాలా మంది మాజీ క్రికెట‌ర్లు కూడా కోహ్లిని త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యంపై పున‌రాలోచ‌న చేసుకోవాల‌ని సూచిస్తున్నారు. ఈ సిరీస్‌తోనే టీమిండియా  2025- 27 వరల్డ్​ టెస్టు ఛాంపియన్​షిప్ ప్రారంభం కానుంది. ఒకవేళ విరాట్ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఈసారి ఇంగ్లండ్‌కు వెళ్లే జ‌ట్టులో అనుభవం లేని యువ ఆట‌గాళ్లే ఉండే ఛాన్స్ ఉంది. ఈ క్ర‌మంలోనే బీసీసీఐ అత‌డి మ‌న‌సు మార్చేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది.

మ‌న‌సు మార్చుకోని కోహ్లి.. 
కానీ కోహ్లి మాత్రం రిటైర్మెంట్ దిశ‌గానే అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. విరాట్ త‌ను మొద‌ట తీసుకున్న నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉన్నాడ‌ని బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కోహ్లి త‌న టెస్టు రిటైర్మెంట్ విష‌యంపై వారాల క్రితమే సెలెక్టర్లకు సమాచారం ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జ‌రిగే టెస్టు సిరీస్‌లో ఆడేలా అత‌డిని ఒప్పించడానికి బీసీసీఐ ప్ర‌య‌త్నిస్తోంది.

కానీ అత‌డి మాత్రం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకునేలా క‌న్పించ‌డం లేదు. వచ్చే వారం జరిగే సెలక్షన్ సమావేశంలో కోహ్లి కొన‌సాగుతాడా?  లేదా అన్నది తేలిపోనుంది అని బీసీసీఐ వ‌ర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాయి. కాగా రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టికే టెస్టుల‌కు విడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. 

అత‌డి స్దానంలో భార‌త టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ ఎంపికయ్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. ఇంగ్లండ్ సిరీస్‌కు భార‌త జ‌ట్టును మే 23న బీసీసీఐ ప్ర‌క‌టించ‌నుంది. విరాట్ ఇప్పటివరకు 123 టెస్టుల్లో భార‌త్‌ ప్రాతినిధ్యం వహించాడు. 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి.
చ‌ద‌వండి: IND vs SL: ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్ విజేత‌గా భార‌త్.. ఫైన‌ల్లో శ్రీలంక చిత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement