వెలాసిటీ 47 పరుగులకే సరి!

Velocity get all out for 47 runs - Sakshi

బ్యాటింగ్‌లో కుప్పకూలిన మిథాలీ జట్టు

ఎకెల్‌స్టోన్‌కు 4 వికెట్లు

9 వికెట్లతో ట్రయల్‌ బ్లేజర్స్‌ ఘన విజయం  

షార్జా: మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీలో నిరాశాజనక ప్రదర్శన! పేలవ బ్యాటింగ్‌ ప్రదర్శనతో టోర్నీ రెండో లీగ్‌ మ్యాచ్‌ ఏకపక్షంగా సాగింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ట్రయల్‌ బ్లేజర్స్‌ 9 వికెట్ల తేడాతో వెలాసిటీని చిత్తుచేసింది. స్మృతి మంధాన సారథ్యంలోని బ్లేజర్స్‌ ముందు మిథాలీ రాజ్‌ నాయకత్వంలోని వెలాసిటీ నిలబడలేకపోయింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన వెలాసిటీ జట్టును టి20 ప్రపంచ నంబర్‌వన్‌ బౌలర్, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సోఫీ ఎకెల్‌స్టోన్‌ (3.1–1–9–4) బెంబేలెత్తించింది. ఆమె ధాటికి వెలాసిటీ 15.1 ఓవర్లలో 47 పరుగులకే కుప్పకూలింది.

షఫాలీ వర్మ (9 బంతుల్లో 13; 1 ఫోర్, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. జులన్‌ గోస్వామి, రాజేశ్వరీ గైక్వాడ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం స్మృతి మంధాన (6) తొందరగా అవుటైనా... డియాండ్రా డాటిన్‌ (28 బంతుల్లో 29 నాటౌట్‌; 3 ఫోర్లు), రిచా ఘోష్‌ (10 బంతుల్లో 13 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) కలిసి జట్టును గెలిపించారు. బ్లేజర్స్‌ 7.5 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోయి 49 పరుగులు చేసింది. శనివారం జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో ట్రయల్‌     బ్లేజర్స్‌తో సూపర్‌ నోవాస్‌ తలపడుతుంది.    ఈ మ్యాచ్‌లో బ్లేజర్‌ గెలిస్తే ఆ జట్టుతో పాటు వెలాసిటీ ఫైనల్‌ చేరుతుంది. నోవాస్‌ గెలిస్తే మూడు జట్లూ ఒక్కో విజయంతో సమంగా నిలుస్తాయి. అప్పుడు రన్‌రేట్‌      ఆధారంగా ఫైనల్‌ చేరేదెవరో తేలుతుంది.  

సమష్టి వైఫల్యం...
తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన వెలాసిటీ జట్టుకు ఈ మ్యాచ్‌లో ఊహించని రీతిలో షాక్‌ తగిలింది. మొదట సాధారణంగానే మొదలైన ఇన్నింగ్స్‌ పేకమేడలా కుప్పకూలింది. మూడో ఓవర్‌లో షఫాలీ వర్మను చక్కటి బంతితో జులన్‌ అవుట్‌ చేయడంత వెలాసిటీ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత ఎకెల్‌స్టోన్‌ దెబ్బకి వెలాసిటీ జట్టు విలవిల్లాడింది. వరుస బంతుల్లో మిథాలీరాజ్‌ (1), వేద కృష్ణమూర్తి (0)లను ఆమె పెవిలియన్‌ చేర్చింది. కాసేటికే సుష్మ వర్మ (1)ను అవుట్‌ చేసి కోలుకోలేని దెబ్బతీసింది. అంతకుముందే వెలాసిటీ... డేనీ వ్యాట్‌ (3) వికెట్‌ను కూడా కోల్పోయింది.

దీంతో పవర్‌ప్లే ముగిసేసరికే 22/5తో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రాజేశ్వరీ గైక్వాడ్‌ చెలరేగడంతో గత మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన సునె లూస్‌ (4), దివ్యదర్శిని (0) వరుస బంతుల్లో పెవిలియన్‌ చేరారు. 10 ఓవర్లకు జట్టు స్కోరు 27/7. తర్వాత మరో ఐదు ఓవర్ల ఆట జరిగినా కేవలం 20 పరుగులు మాత్రమే జోడించగలిగింది. అనంతరం అతి స్వల్ప లక్ష్యఛేదనను ట్రయల్‌ బ్లేజర్స్‌ సులువుగానే ఛేదించింది. కెప్టెన్‌ స్మృతి మంధాన నాలుగో ఓవర్లో వెనుదిరిగినా... ఏమాత్రం తడబడకుండా రిచా ఘోష్, డాటిన్‌ పని పూర్తి చేశారు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 24 బంతుల్లో అభేద్యంగా 370 పరుగులు జోడించారు. ఎనిమిదో ఓవర్‌ తొలి బంతికి  సిక్సర్‌తో రిచా మ్యాచ్‌ను ముగించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top