వైభవ్‌ సూర్యవంశీ వల్లే జైస్వాల్‌ ఫెయిల్‌! | Vaibhav Sooryavanshi Blamed For RR Opener Jaiswal IPL 2026 Failure | Sakshi
Sakshi News home page

వైభవ్‌ వల్లే జైస్వాల్‌ ఫెయిల్‌.. అతడి స్థానాన్ని ఆక్రమించాడు!

May 25 2026 2:10 PM | Updated on May 25 2026 2:48 PM

Vaibhav Sooryavanshi Blamed For RR Opener Jaiswal IPL 2026 Failure

పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన సంచలనం సృష్టించాడు వైభవ్‌ సూర్యవంశీ. దేశీ క్రికెట్‌లో సెంచరీ, డబుల్‌ సెంచరీ, ట్రిపుల్‌ సెంచరీలతో సత్తా చాటి ఐపీఎల్‌ ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌-2025 మెగా వేలంలో రాజస్తాన్‌ రాయల్స్‌ ఏకంగా రూ. 1.10 కోట్లకు వైభవ్‌ను కొనుగోలు చేసింది.

వడ్డీతో సహా చెల్లిస్తున్నాడు
అయితే, నాడు పద్నాలుగేళ్ల పిల్లాడికి అంతమొత్తం చెల్లించి రాజస్తాన్‌ తొందరపడిందా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. వైభవ్‌ వాటన్నంటినీ పటాపంచలు చేస్తూ తన అద్భుత ప్రదర్శనలతో వడ్డీతో సహా చెల్లిస్తున్నాడు.

అత్యధిక పరుగుల వీరుల జాబితాలో
అరంగేట్ర సీజన్‌లోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ (35 బంతుల్లో)తో రాణించిన వైభవ్‌ (Vaibhav Suryavanshi).. ఐపీఎల్‌-2026లో రాజస్తాన్‌ ప్లే ఆఫ్స్‌ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లలో కలిపి విధ్వంసకర సెంచరీ (36 బంతుల్లో) సాయంతో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌.. 583 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుల జాబితాలో టాప్‌-5లో నిలిచాడు.

ఒకప్పుడు రాజస్తాన్‌ పోస్టర్‌ బాయ్‌
అదే సమయంలో మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ 14 మ్యాచ్‌లలో కలిపి కేవలం 397 పరుగులు చేశాడు. కాగా ఒకప్పుడు రాజస్తాన్‌ పోస్టర్‌ బాయ్‌గా యశస్వి ముందు వరుసలో ఉండేవాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని వైభవ్‌ ఆక్రమించాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

భారత స్పిన్‌ దిగ్గజం, రాయల్స్‌ మాజీ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఓ అడుగు ముందుకేసి.. వైభవ్‌ ఆట తీరు వల్ల జైసూ ప్రభావితం అయ్యాడని.. అందుకే ఈ సీజన్లో సరిగ్గా ఆడలేకపోయాడని పేర్కొన్నాడు.

జైసూ విఫలం.. వైభవ్‌ను నిందించిన అశూ!
తన యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘రాజస్తాన్‌ రాయల్స్‌ తరఫున ఈసారి యశస్వి జైస్వాల్‌ ప్రదర్శన నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు అంచనాలు అందుకోలేకపోయాడు. అతడిపై నాకు భారీ అంచనాలు ఉండటమే ఇందుకు కారణం కావొచ్చు.

అయితే, నాకు మరో సందేహం కూడా ఉంది. మరో ఎండ్‌లో వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం జైస్వాల్‌ను భయపెట్టిందని నాకు గట్టిగా అనిపిస్తోంది. నాకు తెలిసి వైభవ్‌ ఆట తీరు జైసూను కుదేలు చేసి.. గందరగోళంలోకి నెట్టేసి ఉంటుంది.

సెహ్వాగ్‌- ఆకాశ్‌ మాదిరి
టెస్టుల్లో టీమిండియా స్టార్లు వీరేందర్‌ సెహ్వాగ్‌- ఆకాశ్‌ చోప్రా ఓపెనింగ్‌ జోడీ మీకు గుర్తుండే ఉంటుంది. నిజానికి ఆకాశ్‌ చోప్రా బాగానే ఆడతాడు. 30- 40 రన్స్‌తో శుభారంభమే ఇస్తాడు. అయితే, సెహ్వాగ్‌ విధ్వంసకర ఆట తీరు కారణంగా ఆకాశ్‌ చోప్రా కనుమరుగైపోయేవాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ బాగా ఆడిన అనుభవం ఆకాశ్‌ చోప్రాకు ఉంది. అయినప్పటికీ పెద్దగా పేరు రాలేదు.

ఇప్పుడు కూడా వైభవ్‌ సూర్యవంశీ ఊచకోత చూసి జైస్వాల్‌ కొద్దిగా షేక్‌ అయినట్లు కనిపిస్తోంది. ఓవైపు.. వైభవ్‌ చితక్కొడుతుంటే.. జైసూ బంతిని బాదేందుకు కష్టపడిన తీరే ఇందుకు నిదర్శనం’’ అని అశూ పేర్కొన్నాడు.

అశూ అభిప్రాయం సరైందేనా?
అశ్విన్‌ అన్నట్లు వైభవ్‌ నిజంగానే జైసూను భయపెట్టాడా? అంటే.. నిజం కాకపోవచ్చనే అనిపిస్తోంది. 24 ఏళ్ల జైస్వాల్‌ 2020 నుంచి ఐపీఎల్‌ ఆడుతున్నాడు. టీమిండియా టెస్టు ఓపెనర్‌గానూ కావాల్సినంత అనుభవం ఉంది.

నిజానికి వైభవ్‌ను చూస్తూ జైసూ భయపడుతున్నాడు అనడం కంటే.. 15 ఏళ్ల పిల్లాడిని స్ఫూర్తిగా తీసుకుని మరో ఎండ్‌లో సిక్సర్ల వర్షం కురిపించే ప్రయత్నం చేస్తున్నాడనిపించింది. 

సీనియర్‌ ఓపెనర్‌గా మైదానంలో వైభవ్‌కు పెద్దన్నలా సలహాలు ఇస్తూ.. అతడు స్వేచ్ఛగా బ్యాటింగ్‌ ఝులిపించడంలోనూ జైసూ పాత్ర ఉందనడంలో సందేహం లేదు. ఏదేమైనా వైభవ్‌ ఇదే జోరు కొనసాగిస్తే మాత్రం త్వరలోనే టీమిండియా ఓపెనర్‌గా సీనియర్లకు పోటీగా మారడం ఖాయం.

చదవండి: అప్పుడేమో అలా.. ఇప్పుడు పశ్చాత్తాపం ఎందుకు?: సెహ్వాగ్‌ ఫైర్‌

Advertisement
 
Advertisement
Advertisement