
టీమిండియా యువ క్రికెటర్, పొట్టి క్రికెట్‌లో మ్యాచ్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్‌కు (Rinku Singh) అండర్ వరల్డ్ (Under World) నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించినట్లు ఓ ప్రముఖ వార్త సంస్థ పేర్కొంది.
వారి సమాచారం మేరకు.. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో రింకూకు దావూద్ గ్యాంగ్ (Dawood Gang) నుంచి మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయి. గ్యాంగ్ సభ్యులు రింకూ ప్రమోషన్ టీమ్‌ను రూ. 5 కోట్లు డిమాండ్ చేశారు.
ఈ కేసుకు సంబంధించి మొహమ్మద్ దిల్షద్, మొహమ్మద్ నవీద్ అనే ఇద్దరిని పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని ఓ కరీబియన్ దీవి పోలీసులు అరెస్ట్ చేసి, ఆగస్ట్ 1న ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో వారు రింకూ సింగ్‌ను బెదిరించినట్లు ఒప్పుకున్నారు.
ఇక్కడ మరో విశేషమేమిటంటే.. రింకూ కేసుకు సంబంధించి పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు, ఇటీవల ముంబైలో హత్య చేయబడ్డ ఎన్‌సీపీ నేత బాబా సిద్దికీ కుమారుడు జీషన్ సిద్దికీని రూ. 10 కోట్ల రూపాయల కోసం బెదిరించిన కేసులో నిందితులు.
మరోసారి మ్యాచ్ ఫినిషర్‌గా..!
రింకూ సింగ్ మరోసారి మ్యాచ్ ఫినిషర్ పాత్రకు న్యాయం చేశాడు. తాజాగా పాకిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో బౌండరీ బాది మ్యాచ్‌ను ముగించాడు. ఈ టోర్నీలో రింకూ ఆడిన ఏకైక మ్యాచ్ ఇదే. రింకూ బౌండరీతో భారత్ ఆసియా కప్‌లో విజేతగా నిలిచింది.