
టీమిండియా యువ బ్యాటర్ రింకూ సింగ్ తన క్రికెట్ ప్రయాణాన్ని కొత్త దశకు తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు. నన్ను కేవలం టీ20 స్పెషలిస్ట్‌గా మాత్రమే చూడకండని టీమిండియా సెలెక్టర్లను పరోక్షంగా మొరపెట్టుకున్నాడు. ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా కొనసాగడం తనకు ఇష్టమని, టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్‌లు ఆడటం తన జీవిత లక్ష్యమని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
రింకూ మాటల్లో.. నాకు తెలుసు. నేను సిక్సర్లు కొట్టడాన్ని ఫ్యాన్స్ అమితంగా ఇష్టపడతారు. దీనికి నేనెంతో కృతజ్ఞుడిని. అలాగని నేను కేవలం టీ20లకు మాత్రమే పరిమితం కాదలచుకోలేదు. రంజీ ట్రోఫీలో నా యావరేజ్ చాలా బాగుంది. ఈ ఫార్మాట్‌లో 55కి పైగా సగటుతో పరుగులు చేశాను.
నేను రెడ్ బాల్ క్రికెట్ ఆడటాన్ని చాలా ఇష్టపడతాను. నేను టీమిండియా తరఫున రెండు వన్డేలు ఆడిన విషయాన్ని కూడా గమనించాలి. అందులో ఓ మ్యాచ్‌లో నేను రాణించాను కూడా. కాబట్టి నేను కేవలం టీ20 ప్లేయర్‌ను మాత్రమే కాదు. అవకాశాలు వస్తే మిగతా ఫార్మాట్లలో కూడా సత్తా చాటగలనని నేను నమ్ముతాను.
వన్ ఫార్మాట్ ప్లేయర్‌గా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. నన్ను నేను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అనుకుంటాను. భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటం నా కల. ఆ అవకాశం వస్తే తప్పక సద్వినియోగం చేసుకుంటాను.
టీమిండియా మాజీ సురేశ్ రైనా నాకు మార్గదర్శి. ప్రతి అవకాశానికి సిద్ధంగా ఉండాలి అని అతను చెప్పిన మాట నా మదిలో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది. ఆ మాటను నేనెప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటాను. ఇప్పటి వరకు నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకున్నాను. టెస్ట్ జెర్సీ ధరించాలన్న కలను సాకారం చేసుకునేందుకు చాలా కృషి చేస్తున్నాను.
రింకూ త్వరలో జరుగబోయే ఆసియా కప్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. ఆసియా కప్ జట్టు ప్రకటనకు ముందు టీమిండియాలో అతని స్థానంపై సందేహాలు ఉండేవి. ఇటీవలికాలంలో అతను చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయకపోవడంతో ఆసియా కప్‌కు ఎంపిక చేస్తారో లేదో అని చాలామంది అనుకున్నారు.
ఆసియా కప్‌కు ఎంపికైన తర్వాత అతను తనపై ఉన్న అపనమ్మకాన్ని చెరిపేశాడు. స్వరాష్ట్రంలో జరిగిన యూపీ టీ20 లీగ్‌లో ఓ విధ్వంసకర శతకం, పలు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి భారత సెలెక్టర్లు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కాకుండా కాపాడుకున్నాడు. ఈ టోర్నీలో రింకూ బౌలర్‌గానూ మెప్పించాడు.