
గత కొంతకాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయనప్పటికీ.. ఆసియా కప్ బెర్త్ దక్కించుకున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్‌ను కొద్ది రోజుల ముందు వరకు విమర్శకులు టార్గెట్ చేశారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్ టీ20 లీగ్ ప్రారంభం కాగానే వారి స్వరం మారిపోయింది. ఈ టోర్నీలో రింకూ బ్యాటర్‌గానే కాకుండా బౌలర్‌గానూ రాణిస్తున్నాడు.
బ్యాటింగ్‌లో యాధాతథంగా మెరపులు మెరిపిస్తూనే.. స్పిన్ బౌలింగ్‌లోనూ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇకపై తాను కేవలం ఫినిషర్‌ను మాత్రమే కాదు బ్యాటింగ్ ఆల్‌రౌండర్నంటూ సంకేతాలు పంపాడు.
ఈ టోర్నీలో మీరట్ మెవెరిక్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రింకూ.. గోరఖ్‌పూర్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం (108) బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు చివరి 6 బంతుల్లో 5 సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించి, తనలోని ఫినిషింగ్ సామర్థ్యాన్ని మరోసారి చాటుకున్నాడు.
తాజాగా రింకూ మరో మెరుపు ప్రదర్శన చేసి ఆసియా కప్‌కు ముందు ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇవాళ (ఆగస్ట్ 27) లక్నో ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేసి తన జట్టు భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. ఈ ఇన్నింగ్స్ తర్వాత రింకూలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగినట్లు కనిపించింది.
ఇదే ఫామ్‌ను అతను ఆసియా కప్‌లోనూ కొనసాగిస్తే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. ఆసియా కప్‌కు ముందు చాలామంది రింకూ జట్టులో అవసరమా అని ప్రశ్నించారు. అతడి బదులు శ్రేయస్ అయ్యర్‌నో లేక బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌లో తీసుకోవాల్సిందని చర్చించుకున్నారు.
అయితే తనపై చర్చలు అనవసరమని రింకూ తాజా ప్రదర్శనలతో నిరూపించాడు. కేవలం విధ్వంసకర బ్యాటర్‌గా, ఫినిషర్‌గా మాత్రమే కాకుండా బౌలింగ్‌లోనూ రాణించగలనని సంకేతాలు పంపాడు. ఈ టోర్నీలో రింకూ 10కి పైగా ఓవర్లు వేసి బౌలర్‌గానూ మంచి మార్కులే కొట్టాడు. ఓ మ్యాచ్‌లో అతడు తీసిన వికెట్ బాగా హైలైటైంది.
మ్యాచ్ విషయానికొస్తే.. లక్నో ఫాల్కన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మీరట్.. రింకూతో పాటు స్వస్తిక్ చికారా (55), రితురాజ్ శర్మ (74 నాటౌట్) మెరుపు అర్ద శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 233 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఫాల్కన్స్ 6.2 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 40 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.