
ఉత్తర్‌ప్రదేశ్ టీ20 లీగ్ 2025లో టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఎన్నో అనుమానాల నడుమ (బ్యాటింగ్ నైపుణ్యంపై) ఈ లీగ్ బరిలోకి దిగిన రింకూ.. తనలోని అత్యుత్తమ టాలెంట్‌ను వెలికి తీసి, తనెంత విలువైన ఆటగాడో మరోసారి జనాలకు రుచి చూపించాడు. ఫినిషర్ అన్న బిరుదుకు రింకూ మరోమారు సార్దకత చేకూర్చాడు.
ఈ లీగ్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన రింకూ.. 170కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో, 59 సగటున సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 295 పరుగులు చేశాడు. ఇందులో 20కి పైగా ఫోర్లు, 20కి పైగా సిక్సర్లు ఉన్నాయంటే రింకూ విధ్వంసం ఏ రేంజ్‌లో సాగిందో ఇట్టే అర్దమవుతుంది. గోరఖ్‌పూర్ లయర్స్‌పై రింకూ చేసిన 45 బంతుల శతకం సీజన్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది.
తాజాగా రింకూ సృష్టించిన బీభత్సకాండ చూసిన తర్వాత ఆసియా కప్‌లో పాల్గొనే జట్ల బౌలర్లు బెదిరిపోతుంటారు. కాశీ రుద్రాస్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో రింకూ శివాలెత్తిపోయాడు. కేవలం 48 బంతుల్లో 6 సిక్సర్లు, 6 బౌండరీల సాయంతో అజేయమైన 78 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఈ ఇన్నింగ్స్‌లో రింకూ గేర్ మార్చిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. 26 పరుగులకే తన జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా రింకూ ఎంట్రీ ఇచ్చాడు. తొలుత అతి నిదానంగా ఆడిన రింకూ.. ఆతర్వాత ఒక్కసారిగా పేట్రేగిపోయాడు.
తానెదుర్కొన్న 48 బంతుల్లో తొలి 20 బంతుల్లో కేవలం 7 పరుగులే చేసిన రింకూ.. ఆతర్వాత పెను విధ్వంసం సృష్టించాడు. తర్వాతి 28 బంతుల్లో ఏకంగా 71 పరుగులు రాబట్టాడు. తానెదుర్కొన్న చివరి 11 బంతుల్లో రింకూ 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాది మరో 26 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు.
రింకూ సృష్టించిన ఈ బీభత్సకాండ ఐపీఎల్‌లో యశ్ దయాల్‌ను చీల్చిచెండాడిన (5 బంతుల్లో 5 సిక్సర్లు) వైనాన్ని గుర్తు చేసింది. తర్వలో ఆసియా కప్ ప్రారంభం కానుండగా.. రింకూ ప్రత్యర్థులను ఇప్పటినుంచే భయపెడుతున్నాడు.
వాస్తవానికి రింకూను ఆసియా కప్‌కు ఎంపిక చేయకూడదనే చర్చ నడిచింది. ఇటీవలి కాలంలో అతను చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన కూడా చేయకపోవడమే ఇందుకు కారణం. రింకూ స్థానంలో ఆల్‌రౌండర్‌నో లేక శ్రేయస్ అయ్యర్‌నో ఎంపిక చేయాల్సిందని చాలామంది అభిప్రాయపడ్డాడు.
అయితే అలాంటి వారి అభిప్రాయాలు తప్పని రింకూ తాజా ప్రదర్శనలతో రుజువు చేశాడు. యూపీ లీగ్‌లో రింకూ బౌలర్‌గానూ తనలోని యాంగిల్‌ను పరిచయం చేశాడు. ఆల్‌రౌండర్‌ను తీసుకుంటే బాగుండేదని భావించే వారిని రింకూ ఈ రకంగానూ సమాధాన పరిచాడు.
యూపీ లీగ్‌లో మీరట్ మెవెరిక్స్‌కు సారధిగానూ వహిస్తున్న రింకూ.. తన జట్టును అదిరిపోయే విజయాలతో ముందుండి నడిపిస్తున్నాడు. కాశీ రుద్రాస్‌పై విజయం తర్వాత మీరట్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం కాశీ రుద్రాస్ మాత్రమే మీరట్ కంటే ముందుంది.