
ఉత్తర్‌ప్రదేశ్ టీ20 లీగ్ టైటిల్‌ను కాశీ రుద్రాస్ రెండో సారి గెలుచుకుంది. లీగ్ తొలి ఎడిషన్‌లో (2023) ఛాంపియన్‌గా నిలిచిన ఈ జట్టు.. ప్రస్తుత ఎడిషన్‌లో (2025) మరోసారి విజేతగా అవతరించింది. నిన్న (సెప్టెంబర్ 6) జరిగిన ఫైనల్లో రుద్రాస్ డిఫెండింగ్ ఛాంపియన్ (2024) మీరట్ మెవెరిక్స్‌ను చిత్తుగా ఓడించింది. శివమ్ మావి, అభిషేక్ గోస్వామి, కెప్టెన్ కరణ్ శర్మ రుద్రాస్ గెలుపులో కీలకంగా వ్యవహరించారు.
ఫైనల్లో టీమిండియా స్టార్ రింకూ సింగ్ లేని లోటు మెవెరిక్స్‌లో స్పష్టంగా కనిపించింది. రింకూ ఆసియా కప్ ఆడేందుకు యూఏఈకి ఫైనల్, అంతకుముందు క్వాలిఫయర్ మ్యాచ్ ఆడలేదు. ఈ సీజన్ ఆధ్యాంతం రింకూ అద్బుత ప్రదర్శనలు చేయడంతో మెవెరిక్స్ ఫైనల్స్ దాకా చేరింది.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మెవెరిక్స్.. రుద్రాస్ బౌలర్లు శివమ్ మావి (4-0-24-2), కార్తీక్ యాదవ్ (3-0-23-2), సునీల్ కుమార్ (4-0-41-2), అటల్ బిహారి రాయ్ (4-0-28-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మెవెరిక్స్ ఇన్నింగ్స్‌లో ప్రశాంత్ చౌదరీ (37) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా వారిలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేదు. ఆర్సీబీ ఆటగాడు స్వస్తిక్ చికారా డకౌట్ కాగా.. కెప్టెన్ మాధవ్ కౌశిక్ 6 పరుగులు మాత్రమే చేశాడు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన రుద్రాస్.. ఓపెనర్లు అభిషేక్ గోస్వామి (61 నాటౌట్), కరణ్ శర్మ (65) సత్తా చాటడంతో 15.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయతీరాలకు చేరింది. అభిషేక్, కరణ్ ఇద్దరు కలిసి మెవెరిక్స్ బౌలర్లను చీల్చిచెండాడారు. ముఖ్యంగా జీషన్ అన్సారీని (3.4-0-0-50) టార్గెట్ చేశారు.
బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించిన (2-0-7-0) రుద్రాస్ కెప్టెన్ కరణ్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ సీజన్‌ను కరణ్ శర్మ లీడింగ్ రన్ స్కోరర్‌గా (12 మ్యాచ్‌ల్లో 519 పరుగులు) ముగించాడు. రుద్రాస్ బౌలర్ శివమ్ మావి (10 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు) ఈ సీజన్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.