ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్‌కు కొత్త పేరు ఖరారు | Tendulkar-Anderson Trophy: England vs India Test series gets a new name | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్‌కు కొత్త పేరు ఖరారు

Jun 6 2025 7:30 AM | Updated on Jun 6 2025 7:45 AM

Tendulkar-Anderson Trophy: England vs India Test series gets a new name

భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు ‘అండర్సన్‌–టెండూల్కర్‌’ ట్రోఫీగా నామకరణం చేశారు. ఆటకు వన్నె తెచ్చిన ఆటగాళ్ల పేర్లను సిరీస్‌లకు పెట్టడం పరిపాటి కాగా... ఇకపై టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య జరిగే సిరీస్‌ను ఈ పేరుతోనే కొనసాగించాలని బీసీసీఐ, ఈసీబీ సమష్టిగా నిర్ణయించాయి.

ఈ నెల 20 నుంచి భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుండగా... దీంతోనే 2025–27 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) సైకిల్‌ మొదలవుతుంది. తొలి టెస్టు ప్రారంభానికి ముందు ఈ ఇద్దరు దిగ్గజాలు ట్రోఫీని ఆవిష్కరించనున్నట్లు సమాచారం.

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ టీమిండియా తరఫున 200 టెస్టు మ్యాచ్‌లు ఆడి 15,921 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు (704) తీసిన పేస్‌ బౌలర్‌ అండర్సన్‌ 188 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్‌ మధ్య ఇంగ్లండ్‌లో జరిగే సిరీస్‌ను పటౌడీ ట్రోఫీగా, భారత్‌లో జరిగే సిరీస్‌ను ఆంటోనీ డి మెల్లో ట్రోఫీగా అభివర్ణిస్తున్నారు. ఇక మీద ఇంటా బయట ఎక్కడ సిరీస్‌ జరిగినా దాన్ని ‘అండర్సన్‌–టెండూల్కర్‌’ ట్రోఫీగానే పిలవనున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య సిరీస్‌లను ఇదే మాదిరిగా ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’గా అభివర్ణిస్తున్న విషయం తెలిసిందే.

ఇంగ్లండ్‌ టూర్‌కు భారత జట్టు: శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వ‌ర‌న్‌, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్

Advertisement
 
Advertisement
Advertisement