Tata Steel Chess India Tournament 2022: రెండో స్థానంలో హంపి, హారిక, అర్జున్‌

Tata Steel Chess India Tournament 2022: Koneru Humpy In Second Spot - Sakshi

కోల్‌కతా: టాటా స్టీల్‌ చెస్‌ ఇండియా అంతర్జాతీయ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నీలో తొలి రోజు మూడో రౌండ్‌ గేమ్‌లు ముగిశాక మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక... ఓపెన్‌ విభాగంలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ రెండు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

తొలి రౌండ్‌లో అనా ముజిచుక్‌ (ఉక్రెయిన్‌)పై 30 ఎత్తుల్లో నెగ్గిన హంపి... అనా ఉషెనినా (ఉక్రెయిన్‌), మరియా (ఉక్రెయిన్‌)లతో జరిగిన తదుపరి రెండు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది. వైశాలితో తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న హారిక... రెండో గేమ్‌లో ఒలివియా (పోలాండ్‌)పై గెలిచి, మూడో గేమ్‌ను ఉషెనినాతో ‘డ్రా’గా ముగించింది.

అర్జున్‌ తొలి గేమ్‌లో 38 ఎత్తుల్లో నొదిర్‌బెక్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై గెలిచి, విదిత్, గుకేశ్‌ (భారత్‌)లతో గేమ్‌లను ‘డ్రా’గా ముగించాడు. బుధవారం మరో మూడు రౌండ్‌లు, గురువారం మరో మూడు రౌండ్‌లు జరుగుతాయి. తొలిసారి ఈ టోర్నీలో ఓపెన్, మహిళల విభాగాల్లో సమాన ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top