అప్పుడు అజిత్‌ లేడు.. అందుకే విరామం: రోహిత్‌ క్లారిటీ | Sakshi
Sakshi News home page

అప్పుడు అజిత్‌ లేడు.. అందుకే విరామం: రోహిత్‌ శర్మ క్లారిటీ

Published Thu, May 2 2024 6:11 PM

T20 WC 2024 Squad Press Meet: Rohit Sharma Opens Up His Break From T20I

టీ20 ప్రపంచకప్‌-2022 తర్వాత  తాను అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండటంపై టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ స్పందించాడు. నాడు టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యం ఇచ్చే క్రమంలోనే పొట్టి ఫార్మాట్‌ నుంచి సుదీర్ఘ విరామం తీసుకున్నట్లు తెలిపాడు.‌

కాగా వరల్డ్‌కప్‌-2022లో భారత జట్టు సెమీస్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్‌ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ప్రక్షాళన చర్యలు చేపట్టిన బీసీసీఐ నాటి సెలక్షన్‌ బోర్డును రద్దు చేసింది. 

అయితే, చీఫ్‌ సెలక్టర్‌గా తిరిగి చేతన్‌ శర్మనే కొనసాగిస్తూ సభ్యులను మాత్రం మార్చింది. ఈ క్రమంలో చేతన టీమిండియాపై వ్యాఖ్యలతో చిక్కుల్లో పడగా.. అతడిని తప్పించిన బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌ను నియమించింది.

ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లి దాదాపు ఏడాది కాలం పాటు అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండటంపై చర్చ నడిచింది. టీ20 ప్రపంచకప్‌-2024లో వీరిద్దరు ఆడతారా లేదా అనే సందేహాల నడుమ అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చారు.

ఈ క్రమంలో రోహిత్‌ శర్మనే కెప్టెన్‌గా కొనసాగుతాడని బీసీసీఐ స్పష్టం చేసింది కూడా. అదే విధంగా హిట్‌మ్యాన్‌ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును మంగళవారం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో కలిసి గురువారం మీడియా ముందుకు వచ్చిన రోహిత్‌ శర్మ టీ20లలో తన గైర్హాజరీ గురించి కీలక విషయాలు వెల్లడించాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌ జరుగుతుందన్న సమయంలో మేము చాలా వరకు అంతర్జాతీయ మ్యాచ్‌లు మిస్సయ్యాం.

టెస్టు ఫార్మాట్లో మ్యాచ్‌లను మిస్‌ చేసుకోవాలని ఎవరూ భావించరు. నిజానికి ఈ ఫార్మాట్‌కే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి కూడా. ఈ విషయం గురించి నేను సహచర ఆటగాళ్లు, కోచ్‌లతో చర్చించాను.

ఆ తర్వాత అజిత్‌ వచ్చాడు. మేము చర్చించిన అంశాల గురించి అప్పుడు అతడికి తెలియదు. ఎప్పుడు ఏ ఫార్మాట్‌కు సంబంధించి కీలక ఈవెంట్‌ ఉంటుందో అదే ఫార్మాట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని భావించాం.

తొలుత టీ20 ప్రపంచకప్‌, తర్వాత వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌.. అనంతరం 50 ఓవర్ల క్రికెట్‌లో వరల్డ్‌కప్‌.. ఈ క్రమంలోనే చాలా వరకు టీ20లు నేను మిస్సయ్యాను’’ అని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా జూన్‌ 1 ప్రపంచకప్‌ 2024 ఆరంభం కానుండగా.. జూన్‌ 5 టీమిండియా తమ తొలిమ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement