T20 WC 2022: ఇషాన్‌ కిషన్‌ వద్దు.. పంత్, డీకే ఉంటే బెటర్‌: పాంటింగ్‌

T20 WC 2022: Ricky Ponting Would Pick Dinesh Karthik Pant Ahead Ishan - Sakshi

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న తరుణంలో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ గురించి ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీలో వెటరన్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఫినిషర్లుగా కీలక పాత్ర పోషించగలరని అంచనా వేశాడు. ఇక వీరికి యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ తోడైతే టీమిండియాను ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్లకు అంత తేలికేమీ కాదని అభిప్రాయపడ్డాడు.

ఇంతమంది ఉన్నారు కాబట్టే!
కాగా ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాల క్రికెట్‌ బోర్డులు మెగా ఈవెంట్‌కు పంపాల్సిన జట్లపై కసరత్తులు చేస్తున్నాయి. బెంచ్‌ స్ట్రెంత్‌ పరీక్షిస్తున్నాయి. అయితే, ఓవైపు దినేశ్‌ కార్తిక్‌ వంటి వెటరన్‌ ప్లేయర్లు రాణించడం.. మరోవైపు యువ ఆటగాళ్లు దూసుకువస్తున్న తరుణంలో.. టీమిండియా ఎంపిక కాస్త కష్టతరంగా మారింది. 

రెండేసి జట్లతో వేర్వేరు దేశాలతో సిరీస్‌లు ఆడుతున్న తరుణంలో చాలా మంది ఆటగాళ్లకు తమను తాము నిరూపించుకునే అవకాశం లభిస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో పోటీ తీవ్రతరమైంది. ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్‌ బ్యాటర్‌గా విఫలం కావడంతో అతడిని ప్రపంచకప్‌ జట్టుకు సెలక్ట్‌ చేయవద్దంటూ కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.

ఇక ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లలో ఓపెనర్‌గా దిగిన పంత్‌.. వరుసగా 26, ఒక పరుగు సాధించాడు. అయితే, మూడో వన్డేలో మాత్రం అజేయ సెంచరీతో సత్తా చాటాడు. మరోవైపు.. సూర్యకుమార్‌ యాదవ్‌ ఇంగ్లండ్‌పై పొట్టి ఫార్మాట్‌ తొలి సెంచరీ సాధించి తానూ రేసులో ఉన్న విషయాన్ని మరోసారి గుర్తుచేశాడు.

ఇషాన్‌ వద్దు.. పంత్‌, డీకే ఉండాలి!
ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్‌ మాట్లాడుతూ.. ‘‘రిషభ్‌​ పంత్‌ వన్డే ఫార్మాట్‌లో ఎలా ఆడగలడో మరోసారి నిరూపించుకున్నాడు. అదే విధంగా టీ20 ఫార్మాట్‌లోనూ తను సత్తా చాటగలడు. ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ తాజా సీజన్‌లో దినేశ్‌ కార్తిక్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.

నా ప్రపంచకప్‌ జట్టులో వాళ్లిద్దరికీ తప్పక చోటు ఉంటుంది. రిషభ్‌ మూడు నాలుగు లేదంటే ఐదో స్థానంలో వచ్చినా.. దినేశ్‌, హార్దిక్‌ ఫినిషర్లుగా రాణించగలరు. వీళ్లు ముగ్గురూ చెలరేగితే టీమిండియా మరింత ప్రమాదకర జట్టుగా మారుతుందనడంలో సందేహం లేదు’’ అని పేర్కొన్నాడు.

అయితే, ఇషాన్‌ కిషన్‌కు జట్టులో స్థానం కష్టమన్న పాంటింగ్‌.. శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ మధ్య ​కూడా పోటీ తీవ్రంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తాజా ఫామ్‌ ప్రకారం వీళ్లిద్దరి కంటే సూర్య ముందుంటాడన్నాడు. నిజానికి జట్టులో ఇలా ఎక్కువ మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉంటే సెలక్టర్లకు తలనొప్పులు తప్పవని పాంటింగ్‌ పేర్కొన్నాడు. ఇక వికెట్‌ కీపర్‌ బ్యాటర్లలో తానైతే ఇషాన్‌ను కాదని పంత్‌, డీకేలకే ఓటు వేస్తానని పాంటింగ్‌ తెలిపాడు.

చదవండి: IND Vs ZIM: జింబాబ్వేతో వన్డే సిరీస్‌.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top