ఈ విజయం వారికి అంకితం.. నేను ఎల్లప్పుడూ ఆ బౌలర్లకు అభిమానినే: సూర్య | Suryakumar Yadav Dedicates Victory Over Pakistan To indian Armed Forces | Sakshi
Sakshi News home page

ఈ విజయం వారికి అంకితం.. నేను ఎల్లప్పుడూ ఆ బౌలర్లకు అభిమానినే: సూర్య

Sep 15 2025 8:40 AM | Updated on Sep 15 2025 10:14 AM

Suryakumar Yadav Dedicates Victory Over Pakistan To indian Armed Forces

సూర్యకుమార్‌ యాదవ్‌ (PC: ACC)

పాకిస్తాన్‌ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. ఆసియా కప్‌-2025 టోర్నమెంట్లో భాగంగా ఆదివారం పాక్‌ (IND vs PAK)తో తలపడిన భారత్‌.. ఏడు వికెట్ల తేడాతో దాయాదిని చిత్తు చేసింది. తద్వారా సూపర్‌-4 దశకు మార్గాన్ని సుగమం చేసుకుంది.

ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) సంతృప్తి వ్యక్తం చేశాడు. అదే విధంగా.. చిరకాల ప్రత్యర్థి పాక్‌పై సాధించిన ఈ విజయాన్ని భారత సైన్యానికి అంకితం చేశాడు. అంతేకాదు.. తన పుట్టినరోజున టీమిండియా అభిమానులకు ఇలాంటి కానుక ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు.

పాక్‌పై టీమిండియా గెలుపు అనంతరం సూర్య మాట్లాడుతూ.. ‘‘స్టేడియంలోని ప్రేక్షకులు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం సంతోషకరం. టీమిండియాకు నా తరఫున ఇదొక రిటర్న్‌ గిఫ్ట్‌ లాంటిది. ముందు నుంచి గెలుపుపై ఆత్మవిశ్వాసంగానే ఉన్నాము.

స్పిన్నర్లకు నేను ఎల్లప్పుడూ అభిమానినే
అన్ని మ్యాచ్‌లలాగే ఇదీ ఒకటి అని ముందుగానే అన్నింటికీ సిద్ధమయ్యాము. ఈ టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. 

కొన్ని నెలల క్రితమే ఇక్కడ ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచాము. ఇక్కడి పిచ్‌లపై స్పిన్నర్ల అవసరం ఎలాంటిదో నాకు తెలుసు. మధ్య ఓవర్లలో మ్యాచ్‌ను మలుపు తిప్పగల స్పిన్నర్లకు నేను ఎల్లప్పుడూ అభిమానినే’’ అని తెలిపాడు. 

భారత సైన్యానికి ఈ విజయం అంకితం
అదే విధంగా.. ‘‘పహల్గామ్‌ ఉగ్రదాడి బాధితులకు మేము ఎల్లవేళలా అండగా ఉంటామని ఈ సందర్భంగా మరోసారి చెబుతున్నాను. ఉగ్రమూకలను ఏరివేయడంలో ధైర్యసాహసాలు చూపిన భారత సైన్యానికి ఈ విజయం అంకితం చేస్తున్నాము.

వారు ఎల్లప్పుడూ ఇలాగే మనల్ని గర్వపడేలా చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తూ ఉంటారని కోరుకుంటున్నా. వారి ముఖాలపై చిరునవ్వులు తీసుకువచ్చేందుకు మైదానంలో మాకు వచ్చిన ఏ అవకాశాన్ని మేము వదులుకోము’’ అంటూ సూర్యకుమార్‌ యాదవ్‌ ఉద్వేగానికి లోనయ్యాడు.

భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ స్కోర్లు
👉వేదిక: దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం, దుబాయ్‌
👉టాస్‌: పాకిస్తాన్‌.. తొలుత బ్యాటింగ్‌
👉పాక్‌ స్కోరు: 127/9 (20)
👉భారత్‌ స్కోరు: 131/3 (15.5)
👉ఫలితం: పాక్‌పై ఏడు వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: కుల్దీప్‌ యాదవ్‌ (4 ఓవర్ల కోటాలో 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు).

చదవండి: Asia Cup 2025: అభిషేక్ విధ్వంసం.. షాహిన్ అఫ్రిదికి ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement