World Junior Wrestling Championship: పసిడి ‘పట్టు’ చిక్కలేదు

Silver For Sanju Devi, Bhateri on Junior World Wrestling Championship - Sakshi

సంజూ, భటేరిలకు రజతాలే

జూనియర్‌ ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌

వుఫా (రష్యా): జూనియర్‌ ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ పతకాల పంట పండింది కానీ... పసిడి పట్టు ఎవరికీ చిక్కలేదు. అటు పురుషుల ఈవెంట్‌లో, ఇటు మహిళల విభాగంలో ఫైనల్‌ చేరిన భారత రెజ్లర్లు రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నారు. శుక్రవారం స్వర్ణం కోసం తలపడిన మహిళా రెజ్లర్లు సంజూ దేవి, భటేరిలు రజతాలతో సంతృప్తి చెందారు.

62 కేజీల కేటగిరీలో సెమీస్‌ దాకా ప్రత్యర్థులందరిపై ఆధిపత్యం చలాయించిన సంజూ దేవి తీరా ఫైనల్‌కొచ్చేసరికి పట్టు సడలించింది. రష్యా రెజ్లర్‌ ఎలీనా కసబియెవా 10–0 పాయింట్ల తేడాతో సంజూ ‘పసిడి’కలను కలగానే మిగిల్చింది. బౌట్‌లో సంజూకు ఏమాత్రం అవకాశమివ్వకుండా ఎలీనా తేలిగ్గా పడేసింది. 65 కేజీల ఫైనల్లో భటేరికి మాల్డొవా రెజ్లర్‌ ఇరినా రింగాసి చెక్‌ పెట్టింది.

12–2 తేడాతో భటేరిని ఓడించింది. కాంస్య పతక పోరులో నిలిచిన సనేహ్‌ (72 కేజీలు) గాయంతో విలవిలాడుతూ బౌట్‌ మధ్యలోనే వైదొలగింది. మరియమ్‌ గుసెనొవా (రష్యా) 3–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో మోకాలి గాయాన్ని భరించలేక సనేహ్‌ ఆటను కొనసాగించలేకపోయింది.

ఈ టోర్నమెంట్‌లో మహిళా రెజ్లర్లు పురుషుల కంటే మెరుగైన ప్రదర్శనే ఇచ్చారు. 3 రజతాలు, 2 కాంస్యాలతో మొత్తం 5 పతకాలు సాధించారు. పురుషుల కేటగిరీలో భారత్‌ 6 పతకాలు సాధించినప్పటికీ ఒక్కటి (రజతం) మినహా అన్నీ కాంస్యాలే ఉన్నాయి. గ్రీకో రోమన్‌ రెజ్లర్లు అంతా క్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు. శుక్రవారం బరిలోకి దిగిన ఐదుగురు రెజ్లర్లలో ఏ ఒక్కరు సెమీస్‌ అయినా చేరలేకపోయారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top