
కెప్టెన్సీనుంచి రోహిత్ శర్మ అవుట్
టీమ్‌లో రోహిత్, కోహ్లిలకు చోటు
వన్డేల్లో తొలిసారి నితీశ్, జురేల్
ఆసీస్‌తో వన్డే, టి20 సిరీస్‌లకు భారత జట్ల ప్రకటన
రోహిత్ శర్మ భారత వన్డే జట్టు కెప్టెన్ హోదాలో చాంపియన్స్ ట్రోఫీలో జట్టును విజేతగా నిలిపాడు. దీని తర్వాత టీమిండియా మరో వన్డే మ్యాచ్ ఆడలేదు. లెక్క ప్రకారం చూస్తే ఏదైనా స్వల్ప మార్పు మినహా అదే జట్టు తర్వాతి సిరీస్ కోసం కొనసాగాలి. కానీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ భిన్నంగా ఆలోచించింది. ఐసీసీ టోర్నీని గెలిపించినా సరే... సారథ్యం నుంచి తప్పించి అనూహ్య నిర్ణయం తీసుకుంది.
ఓపెనింగ్ బ్యాటర్‌గా జట్టులో స్థానం దక్కించుకోగలిగిన ఆటగాడు నాయకత్వానికి మాత్రం అవసరం లేదని తేలి్చంది. ఇప్పటికే టెస్టు కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్‌ను ఇప్పుడు వన్డే కెప్టెన్‌గా కూడా నియమించి మార్పుకు సెలక్టర్లు శ్రీకారం చుట్టారు. ఆటగాళ్లుగా మాత్రం రోహిత్, విరాట్ కోహ్లి భారత జట్టు తరఫున ఆ్రస్టేలియా పర్యటనకు ఎంపికయ్యారు.
అహ్మదాబాద్: భారత టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఇప్పుడు వన్డేల్లోనూ సారథ్య బాధ్యతలు చేపడుతున్నాడు. అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ గిల్‌ను వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఇప్పటి వరకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మను అనూహ్యంగా నాయకత్వం నుంచి తప్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగే 3 వన్డేలు, 5 టి20ల సిరీస్‌ల కోసం టీమ్‌లను సెలక్టర్లు ప్రకటించారు.
కెప్టెన్‌గా రోహిత్ వైఫల్యం లేకపోయినా... భవిష్యత్తును, ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని 26 ఏళ్ల గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు సెలక్టర్లు వెల్లడించారు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో తొలి సారి టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్ ఇప్పుడు రెండు ఫార్మాట్‌లలో కెప్టెన్ కావడంతో పాటు టి20 టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. 2026 టి20 వరల్డ్ కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌నుంచి అతనికి టి20 సారథ్య బాధ్యతలు కూడా వచ్చే అవకాశం ఉంది.
రోహిత్ వయసు (38)ను దృష్టిలో ఉంచుకొని చూస్తే 2027 వరకు ఆటగాడిగా, కెప్టెన్‌గా కొనసాగడం కష్టంగానే అనిపించినా... ఇంత తొందరగా అతడిని కెప్టెన్ హోదానుంచి తప్పిస్తారనేది మాత్రం ఎవరూ ఊహించలేదు. అయితే అసలు వన్డే జట్టులో ఉంటారా లేదా అనే చర్చ జరిగిన నేపథ్యంలో... రోహిత్‌తో పాటు మరో సీనియర్ విరాట్ కోహ్లిలకు కూడా వన్డే టీమ్‌లో స్థానం లభించింది.
వైస్ కెప్టెన్‌గా శ్రేయస్...
భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టులో పలు మార్పులు జరిగాయి. ఆ టీమ్‌లో ఉన్నవారిలో రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా ఇంకా గాయాలనుంచి కోలుకోలేదు. ఇద్దరు స్పిన్నర్లు జడేజా, వరుణ్ చక్రవర్తిలను ఎంపిక చేయలేదు. పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి కూడా జట్టులో స్థానం లభించలేదు. వారి స్థానాల్లో నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురేల్, ప్రసిధ్ కృష్ణ, అర్‡్షదీప్ సింగ్, మొహమ్మద్ సిరాజ్ వచ్చారు. టాప్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు వన్డేల నుంచి మరోసారి విశ్రాంతినిచ్చారు.
గత ఏడాది ఆగస్టు తర్వాత వన్డేలు ఆడని సిరాజ్ తన ఇటీవలి టెస్టు ప్రదర్శనతో మళ్లీ టీమ్‌లోకి రాగా... టెస్టులు, టి20ల్లో ఆకట్టుకున్న ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, కీపర్ ధ్రువ్ జురేల్‌లకు వన్డేల్లో ఇదే తొలి అవకాశం. దుబాయ్ తరహాలో ఎక్కువ మంది స్పిన్నర్లను ఆడించే అవకాశం ఆ్రస్టేలియాలో లేదని...అందుకే జడేజాను పక్కన పెట్టామని అగార్కర్ స్పష్టం చేశాడు. వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్‌ను ఈ సిరీస్ కోసం వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
సుందర్‌కు చోటు...
టి20 టీమ్‌లో మాత్రం సెలక్టర్లు పెద్దగా మార్పేమీ చేయలేదు. ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన జట్టులో ఒక్క హార్దిక్ పాండ్యా మాత్రమే గాయం కారణంగా దూరమయ్యాడు. అతని స్థానంలోనే ఆల్‌రౌండర్‌గా నితీశ్ రెడ్డికి స్థానం లభించింది. ఆ 15 మందితో పాటు ఆ్రస్టేలియా పర్యటన కోసం అదనంగా 16వ ఆటగాడి రూపంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఎంపిక చేశారు. వన్డేలకు దూరంగా ఉండనున్న బుమ్రా టి20లు మాత్రం ఆడతాడు. భారత్, ఆ్రస్టేలియా మధ్య అక్టోబర్ 19, 23, 25 తేదీల్లో వన్డేలు...అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 మధ్య 5 టి20లు జరుగుతాయి.