source: BCCI X
శ్రీలంకపై తొలి టెస్టులో భారత్‌కు 165 పరుగుల భారీ విజయాన్నందించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన ఖాతాలో మరో అరుదైన రికార్డును వేసుకున్నాడు. తొలి 10 టెస్టుల్లో అత్యధిక విజయాలు (6) సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో విరాట్ కోహ్లి (5), రోహిత్ శర్మ (5)ను వెనక్కు నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో ఎంఎస్ ధోని 7 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా.. గిల్, సౌరవ్ గంగూలీ (6)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.
గిల్ కెప్టెన్సీ ప్రయాణం
శుభ్‌మన్ గిల్ 2025లో ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌తో భారత టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సిరీస్‌లో భారత్ రెండు టెస్టులు గెలిచింది. అనంతరం వెస్టిండీస్‌పై 2-0 సిరీస్ విజయం, ఆతర్వాత ఆఫ్ఘనిస్తాన్‌పై ఏకైక టెస్టులో విజయం సాధించాడు. తాజాగా శ్రీలంకపై గాలే టెస్టులో విజయం సాధించడంతో అతని ఖాతాలో ఆరో విజయం చేరింది.
గిల్ తాజా విజయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. భారత్‌కు ఇది 600వ టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా గిల్ చరిత్రలో తన పేరును ప్రత్యేకంగా లిఖించుకున్నాడు.
ఈ గెలుపుతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను కూడా మెరుగుపర్చుకుంది. తొలి టెస్టుకు ముందు భారత్ PCT 48.15%గా ఉండగా, శ్రీలంకపై విజయం తర్వాత అది 53.55%కి పెరిగింది. PCT శాతం పెరిగినప్పటికీ భారత్ ఐదో స్థానంలోనే కొనసాగుతోంది. నాలుగో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌తో భారత్‌కు ఇంకా గణనీయమైన తేడా ఉంది.
ఈ సైకిల్‌లో భారత్ ఫైనల్ రేసులో నిలవాలంటే మిగిలిన 8 మ్యాచ్‌ల్లో భారీగా విజయాలు సాధించాల్సి ఉంటుంది. భారత్ తదుపరి శ్రీలంకతో మరో టెస్టు, న్యూజిలాండ్‌తో రెండు టెస్టులు, ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం 6 టెస్టులు గెలిస్తే భారత్‌కు ఫైనల్ చేరే అవకాశాలు బలపడతాయి.
ఆధిక్యంలోకి వెళ్లిన భారత్
రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తున్న భారత్ తొలి టెస్ట్ విజయంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ ఆగస్టు 23న కొలంబోలో ప్రారంభం కానుంది.
చెలరేగిన పడిక్కల్, సుతార్
లంకపై తొలి టెస్ట్ విజయంలో దేవదత్ పడిక్కల్, మానవ్ సుతార్ కీలకపాత్రలు పోషించారు. బ్యాటింగ్‌లో పడిక్కల్ (167, 44), బౌలింగ్‌లో సుతార్ (10 వికెట్లు) చెలరేగిపోయారు. సుతార్ రెండో ఇన్నింగ్స్‌లో (6-55) అద్భుతంగా బౌలింగ్ చేసి, 372 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకను 206 పరుగులకే ఆలౌట్ అయ్యేలా చేశాడు.


