
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహ్మద్ యూసఫ్‌పై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ మదన్ లాల్ (Madan Lal) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పబ్లిసిటీ కోసం ఎంతకైనా దిగజారడం పాక్ క్రికెటర్లకు అలవాటేనని.. వాళ్ల క్యారెక్టరే అంత అంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఆసియా కప్-2025 టోర్నమెంట్లో టీమిండియా పాకిస్తాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.
నో- షేక్‌హ్యాండ్
దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. పాక్‌ను 127 పరుగులకే పరిమితం చేసింది. ఇక స్వల్ప లక్ష్య ఛేదనను 15.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి పూర్తి చేసింది. ఇదిలా ఉంటే.. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి దాయాదితో ముఖాముఖి తలపడిన టీమిండియా మైదానంలో ఏ దశలోనూ పాక్ ఆటగాళ్లతో ఎలాంటి కమ్యూనికేషన్ పెట్టుకోలేదు.
టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాక్ సారథి సల్మాన్ ఆఘాకు షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా టీమిండియా ఇదే పంథా అనుసరించింది. దీనిని తీవ్ర అవమానంగా భావించిన పాక్.. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారంటూ నానాయాగీ చేసింది.
సూర్యకుమార్ యాదవ్‌పై దిగజారుడు వ్యాఖ్యలు
ఈ క్రమంలో పాక్ మాజీ క్రికెటర్ మొహ్మద్ యూసఫ్.. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. సూర్య పేరును కావాలనే తప్పుగా పలుకుతూ ‘ఆ పంది’ కుమార్ అంటూ చీప్ కామెంట్లు చేశాడు. అంతేకాదు.. అంపైర్లను అడ్డుపెట్టుకుని టీమిండియా మ్యాచ్ గెలిచిందంటూ ఆరోపించాడు.
పాకిస్తాన్ క్రికెటర్ల క్యారెక్టరే అంత
ఈ నేపథ్యంలో 1983 వరల్డ్‌కప్ విజేత మదన్ లాల్ మొహ్మద్ యూసఫ్ తీరుపై మండిపడ్డాడు. ‘‘పాకిస్తాన్ క్రికెటర్ల క్యారెక్టరే అంత. ఎవరైనా దూషించే హక్కు మీకెక్కడిది?.. వాళ్లకు ఇలా మాట్లాడటం మాత్రమే తెలుసు. అంతకంటే ఇంకేమీ పట్టదు.
సొంత జట్టు ప్లేయర్లనే తిట్టిన చరిత్ర వారికి ఉంది. వరుస పరాజయాలతో విసుగెత్తిపోయి ఉన్నారు. అందుకే ఇప్పుడు ఇతర జట్ల ఆటగాళ్లను కూడా దూషించడం మొదలుపెట్టారు. దీనిని బట్టి వాళ్ల చదువు, సంస్కారాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ఇలా మాట్లాడేవారంతా మూర్ఖులు.
పబ్లిసిటీ కోసమే
ఈ విషయం గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. నిజానికి మనమే వాళ్లకు ఎక్కువగా ప్రచారం ఇస్తున్నాం. వాళ్లకు కావాల్సింది కూడా ఇదే. పబ్లిసిటీ కోసం వాళ్లు ఏమైనా చేస్తారు. భారత జట్టు గురించి మాట్లాడుతూ వ్యూస్ కోసం యూట్యూబ్ చానెళ్లు ఇలాంటి పనిచేస్తున్నాయి’’ అని 74 ఏళ్ల మదన్ లాల్ ANIతో పేర్కొన్నాడు.
అదే విధంగా.. టీమిండియా తమ అద్భుత ఆట తీరుతో గెలిచిందంటూ యూసఫ్‌కు మదన్ లాల్ కౌంటర్ ఇచ్చాడు. కొన్నిసార్లు అంపైర్లు తప్పు చేసినా.. ఇప్పుడున్న అత్యాధునిక సాంకేతికతో వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు.
చదవండి: చావో- రేవో!.. పాకిస్తాన్ సూపర్-4కు అర్హత సాధించాలంటే..