చావో- రేవో!.. పాకిస్తాన్‌ సూపర్‌-4కు చేరాలంటే.. | Asia Cup 2025 Group A Qualification Scenarios: What Pakistan UAE need to do | Sakshi
Sakshi News home page

చావో- రేవో!.. పాకిస్తాన్‌ సూపర్‌-4కు అర్హత సాధించాలంటే..

Sep 17 2025 10:38 AM | Updated on Sep 17 2025 1:28 PM

Asia Cup 2025 Group A Qualification Scenarios: What Pakistan UAE need to do

ఆసియా కప్‌-2025 టోర్నమెంట్‌లో టీమిండియా ఇప్పటికే సూపర్‌-4 దశకు అర్హత సాధించింది. గ్రూప్‌-‘ఎ’లో ఉన్న భారత జట్టు తొలుత యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)ని ఓడించింది. యూఏఈ విధించిన లక్ష్యాన్ని 4.3 ఓవర్లలోనే ఛేదించి తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

సూపర్‌-4 బెర్తు ఖరారైంది ఇలా..
ఇక రెండో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ సేన.. దాయాది పాకిస్తాన్‌ (Ind vs Pak)ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ క్రమంలో నాలుగు పాయింట్లు సంపాదించిన టీమిండియా.. యూఏఈ- ఒమన్‌ను ఓడించి.. ఎలిమినేట్‌ చేయగానే సూపర్‌-4 బెర్తు ఖరారు చేసుకుంది.  

ఇక గ్రూప్‌-‘ఎ’ నుంచి రెండో బెర్తు కోసం పాకిస్తాన్‌- యూఏఈ పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటి మ్యాచ్‌లో ఇరుజట్లు చావోరేవో తేల్చుకోనున్నాయి. కాగా యూఏఈ- పాకిస్తాన్‌ ఈ టోర్నీలో ఇప్పటి వరకు చెరో మ్యాచ్‌ గెలిచాయి. ఈ రెండు జట్లు ఒమన్‌ను ఓడించి చెరో రెండు పాయింట్లు సాధించాయి.

గెలిచిన జట్టుకే అవకాశం
ఈ క్రమంలో దుబాయ్‌ వేదికగా జరిగే బుధవారం జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరతాయి. తద్వారా మొత్తంగా నాలుగు పాయింట్లతో సూపర్‌-4కు అర్హత సాధిస్తుంది.

అంటే.. పాకిస్తాన్‌ యూఏఈని ఓడిస్తే.. నేరుగా సూపర్‌-4లో అడుగుపెడుతుంది. ఒకవేళ యూఏఈ గెలిస్తే.. టీమిండియాతో కలిసి గ్రూప్‌-‘ఎ’ నుంచి సూపర్‌-4కు అర్హత సాధిస్తుందన్న మాట.

ఫలితం తేలకుంటే మాత్రం
ఒకవేళ మ్యాచ్‌ గనుక ‘టై’ అయినా.. ఏదేని కారణాల చేత ఫలితం తేలకపోయినా ఇరుజట్లకు చెరో పాయింట్‌ వస్తుంది. అప్పుడు నెట్‌ రన్‌రేటు ఆధారంగా మెరుగ్గా ఉన్న జట్టుకు బెర్తు ఖరారు అవుతుంది. ప్రస్తుతం నెట్‌ రన్‌రేటు పరంగా పాకిస్తాన్‌ (+1.649).. యూఏఈ కంటే మెరుగ్గా ఉంది. కాబట్టి ఈ సమీకరణ ఆధారంగా పాకిస్తాన్‌కే సూపర్‌-4 చేరే అవకాశం ఉంటుంది.

AI ఆధారిత టేబుల్‌

ఒమన్‌, హాంకాంగ్‌ ఎలిమినేట్‌
యూఏఈ వేదికగా ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఆసియా కప్‌ టోర్నీలో గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, యూఏఈ... గ్రూప్‌-‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, హాంకాంగ్‌ పాల్గొంటున్నాయి. ఇప్పటికే గ్రూప్‌-‘ఎ’ నుంచి ఒమన్‌.. గ్రూప్‌-‘బి’ నుంచి హాంకాంగ్‌ ఎలిమినేట్‌ అయ్యాయి.

చదవండి: IND Vs PAK Handshake Row: ఐసీసీ యూటర్న్‌.. పాకిస్తాన్‌కు ఊరట?!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement