సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్‌ మాలిక్‌! | Sakshi
Sakshi News home page

Sania Mirza: సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్‌ మాలిక్‌!

Published Sat, Jan 20 2024 12:27 PM

Shoaib Malik Wedding Pics With Sana Javed Amid Rumours Separation with Sania Mirza - Sakshi

Shoaib Malik marries Pakistani actress Sana Javed:పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తానీ నటి సనా జావెద్‌ను పెళ్లాడాడు. ఈ విషయాన్ని షోయబ్‌ మాలిక్‌ స్వయంగా వెల్లడించాడు. సోషల్‌ మీడియా వేదికగా తమ పెళ్లి ఫొటోలు పంచుకుంటూ.. ‘‘జంటగా మేము ఇలా’’ అంటూ హార్ట్‌ ఎమోజీలు జతచేశాడు షోయబ్‌ మాలిక్‌. 

షోయబ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సానియా
కాగా భారత టెన్నిస్‌ స్టార్‌, హైదరాబాదీ సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2010లో వీరి వివాహం జరుగగా.. 2018లో కుమారుడు ఇజహాన్‌ జన్మించాడు. అయితే, సానియా కంటే ముందు షోయబ్‌ మాలిక్‌ అయేషా సిద్దిఖీ అనే మహిళను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఆమె నుంచి విడిపోయిన తర్వాత సానియాను పెళ్లాడినట్లు తెలుస్తోంది.

హృదయం ముక్కలైందన్న సానియా
ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా సానియా- షోయబ్‌ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి. వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వదంతులు వ్యాపించాయి. నటి ఆయేషాతో ఓ ఫొటోషూట్‌లో షోయబ్‌ మాలిక్‌ అత్యంత సన్నిహితంగా కనిపించడం.. అదే సమయంలో హృదయం ముక్కలైందంటూ సానియా పోస్టులు పెట్టడం వీటికి ఊతమిచ్చింది.

అదే విధంగా కుమారుడి పుట్టినరోజు వేడుకలోనూ సానియా- షోయబ్‌ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించడంతో విడాకుల వార్తలు విస్తృతంగా వ్యాపించాయి.  ఈ నేపథ్యంలో సానియా మీర్జా బుధవారం నర్మగర్భ సందేశం పోస్ట్‌ చేయడంతో వీరు విడిపోయారని నిర్ధారణకు వచ్చారు నెటిజన్లు.

వివాహ బంధం.. విడాకులు.. రెండూ క్లిష్టమైనవే: సానియా
‘‘వివాహ బంధం అత్యంత క్లిష్టమైనది. విడాకులు కూడా అంతే కష్టమైనవి. ఇందులో ఏది అత్యంత ఇబ్బందికరమైందో మీరే ఎన్నుకోండి. ఒబేసిటీ హార్డ్‌.. ఫిట్‌గా ఉండటం కూడా కష్టమే. మరి ఇందులో ఏది ఎంచుకుంటారు? అప్పుల్లో కూరుకుపోవడం కష్టంగా తోస్తుంది.. అదే సమయంలో ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కూడా అలాగే అనిపిస్తుంది.

ఇందులో మీకు ఏం కావాలో ఎంచుకోండి. కమ్యూనికేట్‌ చేయడం.. కమ్యూనికేట్‌ చేయకుండా ఉండటం కూడా కష్టమే. ఇందులో ఏది అత్యంత కష్టమో మీరే ఎంచుకోండి. జీవితం నల్లేరు మీద నడకలాంటిది కాదు.

తెలివిగా ఎంచుకోవాలి
ఎప్పుడూ క్లిష్టతరంగానే ఉంటుంది. అయితే, అందులో మనకేదీ కావాలో మనం తెలివిగా ఎంచుకోవాలి’’ అని సానియా మీర్జా భావోద్వేగపూరిత నోట్‌ షేర్‌ చేసింది. ఇంతలో షోయబ్‌ మాలిక్‌ ఇలా శనివారం నటి సనా జావెద్‌తో పెళ్లి ఫొటోలను షేర్‌ చేయడం గమనార్హం. సానియా- షోయబ్‌ జంట అభిమానులు ఈ చేదు వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఏదైనా యాడ్‌ షూట్‌కు సంబంధించిన ఫొటో అయితే బాగుండని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: Ayodhya Ram Mandir Inauguration: అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి: హర్భజన్‌ సింగ్‌

 
Advertisement
 
Advertisement