డేవిస్‌ కప్‌ సెమీస్‌లో సెర్బియా

Serbia in Davis Cup semis - Sakshi

మలగ (స్పెయిన్‌): ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌ డేవిస్‌ కప్‌ క్వార్టర్‌ ఫైనల్లో కీలకమైన విజయంతో సెర్బియాను సెమీస్‌కు చేర్చాడు. తద్వారా డేవిస్‌ కప్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా ఘనత వహించాడు. టీమ్‌ ఈవెంట్‌లో గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్‌ఫైనల్లో సెర్బియా 2–0తో బ్రిటన్‌పై ఘనవిజయం సాధించింది.

తొలి సింగిల్స్‌లో లోమిర్‌ కెమనొవిచ్‌ (సెర్బియా) 7–6 (7/2), 7–6 (8/6)తో జాక్‌ డ్రాపెర్‌ (బ్రిటన్‌)ను ఓడించగా... రెండో సింగిల్స్‌లో జొకోవిచ్‌ 6–4, 6–4తో కామెరాన్‌ నోరీ (బ్రిటన్‌)పై గెలుపొందాడు. 2–0తో ఫలితం తేలడంతో డుసాన్‌ లాజొవిక్‌తో కలిసి జొకోవిచ్‌ డబుల్స్‌ మ్యాచ్‌ ఆడాల్సిన అవసరం లేకపోయింది.

డేవిస్‌ కప్‌ టోర్నీల్లో గత మూడేళ్లుగా సెర్బియన్‌ స్టార్‌ వరుసగా సాధించిన 21వ విజయమిది. ఓవరాల్‌గా ఈ టీమ్‌ ఈవెంట్‌లో రికార్డు స్థాయిలో జొకోవిచ్‌ 44 విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం సింగిల్స్‌నే పరిగణిస్తే జొకోకు ఇది 40వ విజయం అవుతుంది. సెమీస్‌లో సెర్బియా... ఇటలీని ఎదుర్కొంటుంది. మరో క్వార్టర్స్‌లో ఇటలీ 2–1తో నెదర్లాండ్స్‌పై 
గెలుపొందింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top