గ్రూప్ టాపర్‌గా కంగారూలు
దక్షిణాఫ్రికాపై 7 వికెట్లతో విజయం
ఇండోర్: మహిళల వన్డే వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్లో భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో తలపడనుంది. ఆడిన 7 మ్యాచ్‌లలో 6 విజయాలతో (1 రద్దు) పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానాన్ని అందుకుంది. నేడు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్‌కు నాలుగో స్థానం ఖాయమైంది.
భారత్, ఆ్రస్టేలియా సెమీస్ 30న ముంబైలో జరగనుండగా, గువాహటిలో 29న జరిగే తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ తలపడనుంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 24 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. లారా వోల్‌వర్ట్ (30), సినాలో జాఫ్తా (29) మినహా అంతా విఫలమయ్యారు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలానా కింగ్ (7/18) తన లెగ్ స్పిన్‌తో 7 వికెట్లు పడగొట్టి సత్తా చాటింది. మహిళల వన్డేల్లో ఇది నాలుగో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం. అనంతరం ఆ్రస్టేలియా 16.5 ఓవర్లలో 3 వికెట్లకు 98 పరుగులు చేసి విజయాన్నందుకుంది. బెత్ మూనీ (42), జార్జియా వోల్ (38 నాటౌట్) కలిసి జట్టును గెలిపించారు.


