ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు తన ఇష్ట్రపకారం తనకు నచ్చిన రీతిలో సన్నద్ధమయ్యాయని టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. అదే ఇప్పుడు ఫలితాన్ని చూపించిందని హర్షం వ్యక్తం చేశాడు.
సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన చివరి వన్డేలో సెంచరీ సాధించడంతో పాటు రోహిత్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. ప్రొఫెషనల్ ఆటగాడిగా క్రికెట్ కెరీర్ కోసం సాధన చేయడం సహజమని... అయితే ఆట బయట కూడా మరో ప్రపంచం ఉందని భావించి ప్రాధాన్యతలు తెలుసుకోవాలని అతడు చెప్పాడు.
క్రికెట్ ఒక్కటే జీవితం కాదు
‘క్రికెటర్‌గా కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఒక సిరీస్ కోసం 4–5 నెలల సన్నద్ధం అయ్యే అవకాశం ఎప్పుడూ కలగలేదు. కాబట్టి ఈ సారి ఆ సమయాన్ని బాగా వాడుకున్నాను. నాకు నచ్చిన రీతిలో, నా ఇష్ట్రపకారం సాధన చేయాలని నిర్ణయించుకున్నా. అది బాగా పని చేసింది. మిగిలిన కెరీర్ కోసం ఏం చేయాలో అర్థమైంది కూడా.
భారత్‌తో పోలిస్తే ఆస్ట్రేలియా భిన్నమైన పరిస్థితులు ఉన్నా చాలా సార్లు రావడంతో వాటిపై అవగాహన ఉంది. ఒక్కసారి లయ అందుకుంటే చాలని భావించా. నా కోసం ఎక్కువ సమయం కేటాయించా. జీవితంలో క్రికెట్ కాకుండా ఇతర ప్రాధాన్యతలు కూడా ఉన్నాయని తెలుసుకున్నా’ అని రోహిత్ వెల్లడించాడు.
కోహ్లితో అద్భుతమైన భాగస్వామ్యం
ఆస్ట్రేలియా గడ్డపై ఆడతాన్ని తాను చాలా ఇష్టపడతానని, ఇక్కడి అభిమానులు కూడా ఎంతో మద్దతునిస్తారని రోహిత్ పేర్కొన్నాడు వివరించాడు. ‘సిడ్నీ వన్డేలో నేను భారీ స్కోరు చేయడంతో పాటు జట్టును గెలిపించడం సంతృప్తినిచ్చింది. చాలా కాలం తర్వాత కోహ్లితో అద్భుతమైన భాగస్వామ్యం కుదిరింది. మేం సెంచరీ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పి చాలా రోజులైంది. జట్టుకు ఇది ఉపయోగపడటం సంతోషకరం.
గిల్ అవుట్ కావడం.. శ్రేయస్ గాయం వల్ల..
గిల్ తొందరగా అవుట్ కావడంతో శ్రేయస్ గాయం కారణంగా మాపై బాధ్యత పెరిగింది. నేను, విరాట్ ఎన్నో ఏళ్లుగా కలిసి ఆడుతున్నాం. ఇద్దరికీ అనుభవం ఉంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలం. అందుకే క్రీజ్‌లో ఎంతో మాట్లాడుకుంటూ ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాం.
సిరీస్ గెలవకపోయినా అభిమానులు ఎంతో మద్దతునిచ్చారు. జట్టుతో సంబంధం లేకుండా మంచి ఆటను ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు’ అని రోహిత్ వెల్లడించాడు.
మూడో వన్డేలో గెలిచి
కాగా ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ కోల్పోయింది. ఆతిథ్య జట్టు తొలి రెండు వన్డేల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోగా.. టీమిండియా నామమాత్రపు మూడో వన్డేలో గెలిచి పరువు నిలుపుకొంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ 121, కోహ్లి 74 పరుగులతో అజేయంగా నిలిచి.. భారత్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో గెలిపించారు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 168 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో సిరీస్‌కు ముందే రోహిత్‌ను వన్డే కెప్టెన్‌గా తప్పించి.. అతడి స్థానంలో శుబ్‌మన్ గిల్‌ను సారథిగా నియమించింది బీసీసీఐ. ఇక ఇప్పటికే అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రో- కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.
చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్


