బౌలర్ల కంటే పిచ్‌నే ఎక్కువ నమ్ముకున్న ఇంగ్లండ్‌!

Rohit falls early as hosts trail by 381 at stumps - Sakshi

సాక్షి క్రీడా విభాగం: నాలుగో రోజు లీచ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ క్లీన్‌ బౌల్డ్‌... ‘చెపాక్‌’ పిచ్‌ ఎలా ఉందో, ఎలా ఉండబోతోందో అనేదానికి ఇదో సూచిక! దాదాపు లెగ్‌స్టంప్‌పై పడిన బంతి అనూహ్యంగా టర్న్‌ తీసుకొని ఆఫ్‌స్టంప్‌ను తాకింది. రోహిత్‌ తన కాలును ముందుకు జరిపి డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఇప్పుడు ఇంగ్లండ్‌ తమ బౌలర్లకంటే కూడా పిచ్‌నే ఎక్కువగా నమ్ముకొని గెలుపుపై ఆశలు పెంచుకుంటోంది. ఇలాంటి స్థితిలో భారత జట్టు ఆఖరి రోజు ఎలాంటి వ్యూహం అనుసరించబోతోందో చూడాలి. ఒక్క రోజులో, అదీ టెస్టు మ్యాచ్‌ చివరి రోజు 381 పరుగులు చేయడం సాధ్యమేనా? ఓవర్‌కు 4.2 పరుగుల వేగంతో అదీ అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై చేయగలరా అనేదే ఆసక్తికరం.  

బ్రిస్బేన్‌ విజయం తర్వాత టీమిండియాలో ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగిందనడంలో సందేహం లేదు. ఎలాంటి లక్ష్యం ముందున్నా బెదరకుండా సానుకూల దృక్పథంతో ఆడగలమనే నమ్మకాన్ని ఆ మ్యాచ్‌ కలిగించింది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్‌ పరిస్థితి మాత్రం అందుకు భిన్నం. అయితే ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌ టెస్టులో భారత్‌ లక్ష్యం 328 పరుగులు. చివరి రోజు 324 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో పది వికెట్లూ ఉన్నాయి. సొంత మైదానం కాకపోయినా ఆ సమయానికి పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. మంచి బౌన్స్‌తో షాట్లు ఆడేందుకు తగిన అవకాశం కూడా కనిపించింది. అన్నింటికి మించి పోరాడితే పోయేదేమీ లేదు అన్నట్లుగా రహానే బృందం సాహసం చేయగా, పంత్‌ ప్రత్యేక ఇన్నింగ్స్‌ జట్టును గెలిపించింది.

ఇక్కడ మాత్రం ఇంగ్లండ్‌ చేతిలో ఓడితే అది అవమానకరంగా భావించే పరిస్థితి కాబట్టి రిస్క్‌ చేయడం కష్టం. దీనిని ‘డ్రా’గా ముగిస్తే చాలు, తర్వాతి మూడు టెస్టుల్లో చూసుకోవచ్చనే ఆలోచన సహజం. మరికొందరు తాజా పరిస్థితిని 2008లో ఇదే చెన్నైలో ఇంగ్లండ్‌పై భారత్‌ గెలిచిన టెస్టుతో పోలుస్తున్నారు. నాటి మ్యాచ్‌లో భారత్‌ విజయలక్ష్యం 387 పరుగులు కాగా... నాలుగో రోజే సెహ్వాగ్‌ (68 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 83) మెరుపులతో భారత్‌ 131 పరుగులు చేసేసింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఆఖరి రోజు మరో 256 పరుగులే అవసరమయ్యాయి కాబట్టి సచిన్‌ తదితరుల పని సులువైంది. కాబట్టి దానితో ఈ మ్యాచ్‌కు పోలికే లేదు. తాజాగా బంగ్లాదేశ్‌పై కైల్‌ మేయర్స్‌ అద్భుత బ్యాటింగ్‌తో వెస్టిండీస్‌ గెలిచిన టెస్టులో కూడా చివరి రోజు విండీస్‌ విజయానికి 285 పరుగులు చేయాల్సిన స్థితిలో ఆట మొదలు పెట్టింది. ఇలా చూస్తే ఒకే రోజు 381 పరుగులు దాదాపు అసాధ్యమే!  

అయితే సంకల్పానికి, పట్టుదలకు అడ్డంకి ఏముంటుంది. భారత్‌ కూడా తొలి బంతి నుంచి ‘డ్రా’ కోసం ప్రయత్నించకపోవచ్చు. బ్రిస్బేన్‌ తరహాలోనే ఒక ఎండ్‌ను పుజారా రక్షిస్తుంటే మరో ఎండ్‌లో వచ్చిన ప్రతీ బ్యాట్స్‌మన్‌ దూకుడుగా ఆడే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా పంత్‌ క్రీజ్‌లో ఉన్నంత వరకైనా గెలుపే లక్ష్యంగా టీమిండియా ముందుకు వెళుతుంది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేదు కాబట్టి పరుగులు ధారాళంగా రాకపోతే తమ డిఫెన్స్‌ను నమ్ముకొని ‘డ్రా’పై దృష్టి పెట్టగల శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయనేది వాస్తవం. ఇంగ్లండ్‌ కూడా ‘బ్రిస్బేన్‌’ భయంతోనే గెలుపు కాకపోయినా, ఓడకపోతే చాలనే స్థితిలోకి వెళ్లింది. భారత్‌కు ఎక్కువ ఓవర్లు అందుబాటులో ఉంచకుండా పరుగులు పెద్దగా రాకపోయినా రెండో ఇన్నింగ్స్‌ను సాగదీసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top