
భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025 (IPL 2025) వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో లీగ్‌లో పాల్గొంటున్న విదేశీ ఆటగాళ్లు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది ఇప్పటికే స్వదేశాలకు చేరుకునే క్రమంలో దుబాయ్ వరకు వెళ్లినట్లు సమాచారం. అయితే, పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఆటగాళ్లకు వారి హెడ్ కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) సర్దిచెప్పినట్లు తెలుస్తోంది.
మరేం పర్లేదు.. ఇక్కడే ఉందాం!
సొంత దేశానికి తిరిగి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ... పాంటింగ్ ఢిల్లీలోనే ఉండేందుకు ప్రాధాన్యతనిచ్చాడు. అప్పటికే అతడి లగేజీ విమానాశ్రయానికి చేరుకోగా... అతి కష్టం మీద దానిని తిరిగి తెప్పించుకున్నాడు. అప్పటికే భారత్ నుంచి స్వదేశాలకు తిరుగు పయనమైన విదేశీ ఆటగాళ్లతో పాటు మిగిలిన వారిలో పాంటింగ్ దైర్యం నింపాడు.
ఈ విషయం గురించి పంజాబ్ కింగ్స్ జట్టు సీఈవో సతీశ్ మీనన్ మాట్లాడుతూ.. ‘స్వదేశానికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ పాంటింగ్ నిరాకరించాడు. అంతేగాకుండా విదేశీ ఆటగాళ్లలో ధైర్యం నింపాడు. వారంతా త్వరలో జట్టుతో చేరబోతున్నారు’ అని పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్-2025లో పంజాబ్ జట్టులో ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టొయినిస్, ఆరోన్ హార్డీ, జోష్ ఇన్‌గ్లిస్, జేవియర్ ఉన్నారు. కాగా భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య గురువారం ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ అర్ధంతరంగా ముగిసిపోయిన విషయం తెలిసిందే.
వందే భారత్ రైలులో
శత్రు దేశ వ్యూహాలకు చెక్ పెట్టే క్రమంలో ధర్మశాలలో బ్లాక్ అవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) చేయడంతో త్వరత్వరగా స్టేడియాన్ని ఖాళీ చేయించడంతో పాటు.. ఆటగాళ్లను కూడా బీసీసీఐ అక్కడి నుంచి తరలించింది. ఈ క్రమంలో ధర్మశాల నుంచి ఢిల్లీకి వందే భారత్ రైలులో ఆటగాళ్లను తరలించింది.
ఇందులో భాగంగా బస్సులు, ట్రైన్‌లు మారుతూ ప్రయాణించడంతో విదేశీ ఆటగాళ్లలో ఒకరకమైన భయాందోళన పెరిగిపోవడంతో... వారంతా తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని ఆశించారు. ‘దాడుల వార్తలతో విదేశీ ఆటగాళ్లు కాస్త ఆందోళన చెందారు. వీలైనంత త్వరగా దేశం వీడి ఇళ్లకు చేరుకోవాలని భావించారు.
వారి స్థానంలో ఉంటే ఎవరైనా అలాగే అనుకుంటారు. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం పాంటింగ్ వారికి సర్దిచెప్పాడు’ అని ఓ అధికారి తెలిపారు. కాగా పంజాబ్ పేస్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ మాత్రం దుబాయ్‌కు చేరుకున్నారు.
ఐపీఎల్ తిరిగి ప్రారంభం కావడంపై త్వరలో ప్రకటన రానుండగా... జట్లన్నీ తమ ఆటగాళ్లను అందుబాటులో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఆదివారం ఫ్రాంఛైజీలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాగా, శనివారం భారత్- పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి రాగా.. పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి.
ప్లే ఆఫ్స్ రేసులో పంజాబ్
ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలో తిరిగి ఐపీఎల్ ప్రారంభం కానుంది. మే 16 లేదంటే 17న తిరిగి ఆరంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్ మార్గదర్శనం, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఈ సీజన్‌లో పంజాబ్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది.
ఢిల్లీతో గురువారం మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 10.1 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 122 పరుగులు చేసింది. ఐపీఎల్ తిరిగి ప్రారంభమైనప్పుడు ఈ మ్యాచ్ అక్కడి నుంచే కొనసాగే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇందులో గెలిస్తే పంజాబ్ ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంటుంది. ఇప్పటికి శ్రేయస్ సేన ఖాతాలో పదిహేను పాయింట్లు ఉన్నాయి.
చదవండి: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్ క్రికెటర్లు!