జడేజా, ప్రేరక్‌ సెంచరీలు | Ravindra Jadeja scores 16th century of his first class career | Sakshi
Sakshi News home page

జడేజా, ప్రేరక్‌ సెంచరీలు

Oct 13 2026 4:09 AM | Updated on Oct 13 2026 4:09 AM

Ravindra Jadeja scores 16th century of his first class career

సౌరాష్ట్ర 392 ఆలౌట్‌ 

సుదీప్, పొరెల్‌ శతకాలు

ఢిల్లీపై బెంగాల్‌కు ఆధిక్యం

రాజ్‌కోట్‌: భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 16వ సెంచరీ నమోదు చేశాడు. ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా (209 బంతుల్లో 102; 7 ఫోర్లు), ప్రేరక్‌ మన్కడ్‌ (150 బంతుల్లో 129; 15 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీలు సాధించారు. దాంతో సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 110.4 ఓవర్లలో 392 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 308/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన సౌరాష్ట్ర 86 పరుగులు జోడించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. 

జడేజా, ప్రేరక్‌ ఐదో వికెట్‌కు 205 పరుగులు జోడించారు. ప్రేరక్‌ అవుటయ్యాక టెయిలెండర్లతో కలిసి జడేజా సౌరాష్ట్ర స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. సెంచరీ పూర్తి చేసుకున్నాక చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఛత్తీస్‌గఢ్‌ బౌలర్లలో దేవ్‌ ఆదిత్య సింగ్‌ 67 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా... రుద్ర దెహారి, ధర్మేంద్రసింగ్‌ జడేజా 2 వికెట్ల చొప్పున తీవారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఛత్తీస్‌గఢ్‌ ఆట ముగిసే సమయానికి 55 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 122 పరుగులు సాధించింది. కెప్టెన్‌ అనూజ్‌ తివారి (72 బ్యాటింగ్‌; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. సౌరాష్ట్ర తరఫున ఎనిమిది మంది బౌలర్లు బౌలింగ్‌ చేశారు.  

జార్ఖండ్‌ 587 ఆలౌట్‌ 
జంషెడ్‌పూర్‌లో కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 179.5 ఓవర్లలో 587 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 289/5తో ఆట కొనసాగించిన జార్ఖండ్‌ మరో 298 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు శిఖర్‌ మోహన్‌ సెంచరీ చేయగా.. రెండో రోజు కెప్టెన్‌ విరాట్‌ సింగ్‌ (108; 9 ఫోర్లు), ఆదిత్య సింగ్‌ (147; 17 ఫోర్లు) శతకాలు నమోదు చేశారు. కేరళ బౌలర్లు వైశాఖ్‌ చంద్రన్‌ 5 వికెట్లు, జలక్‌ సక్సేనా 3 వికెట్లు తీసుకున్నారు.  

బెంగాల్‌కు ఆధిక్యం 
కల్యాణిలో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగాల్‌ జట్టుకు 64 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కించుకుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్‌ 79 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. సుదీప్‌ కుమార్‌ ఘరామి (122 బ్యాటింగ్‌; 17 ఫోర్లు), అభిషేక్‌ పొరెల్‌ (114 బ్యాటింగ్‌; 13 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీలతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 199 పరుగులు జత చేశారు.

తుషార్‌ దేశ్‌పాండే ‘హ్యాట్రిక్‌’ 
చండీగఢ్‌తో వాంఖడే మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై పేస్‌ బౌలర్‌ తుషార్‌ దేశ్‌పాండే ‘హ్యాట్రిక్‌’తో సహా ఐదు వికెట్లు పడగొట్టాడు. తుషార్‌ (5/17), మోహిత్‌ అవస్థి (3/9), సిల్వెస్టర్‌ డిసౌజా (2/51) విజృంభించడంతో... చండీగఢ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 19.1 ఓవర్లలో 78 పరుగులకే ఆలౌటైంది. తుషార్‌ ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌లో వరుస మూడు బంతుల్లో చండీగఢ్‌ బ్యాటర్లు అర్జున్‌ ఆజాద్, శివమ్‌ బాంబ్రీ, దీపేందర్‌లను అవుట్‌ చేసి హ్యాట్రిక్‌ సాధించాడు. 

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 249/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ముంబై 429 పరుగులకు ఆలౌటైంది. 351 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పొందిన ముంబై.. చండీగఢ్‌కు ఫాలోఆన్‌ ఇచ్చింది. ఆట ముగిసే సమయానికి చండీగఢ్‌ రెండో ఇన్నింగ్స్‌లో పరుగులేమి చేయకుండా విష్ణు కశ్యప్‌ వికెట్‌ను కోల్పోయింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement