
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే తన 12 ఏళ్ల టెస్టు కెరీర్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ తన రిటైర్మెంట్‌కు ముందు టెస్టు క్రికెట్‌లో కెప్టెన్‌గా, ఆటగాడిగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. న్యూజిలాండ్ చేతిలో భారత్ తొలిసారి టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ కావడం, ఆస్ట్రేలియాతో బీజీటీలో చిత్తుగా ఓడి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరం కావడం వంటివి రోహిత్‌ను మానసికంగా దెబ్బతీశాయనే చెప్పుకోవాలి.
రోహిత్ తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాపై ఆడాడు. ఆ తర్వాత బీజీటీలోని ఆఖరి మ్యాచ్ నుంచి హిట్ మ్యాన్ స్వచ్ఛందంగా తానంతట తనే తప్పుకున్నాడు. దీంతో కనీసం ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే రోహిత్ తన కెరీర్‌ను ముగించాడు. ఈ క్రమంలో భారత మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను కోచ్‌గా ఉండుంటే, సిడ్నీ టెస్టులో రోహిత్ ఆడేవాడని రవిశాస్త్రి వెల్లడించాడు.
"ఐపీఎల్-2025 సీజన్ టాస్ సమయంలో రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తుండగా చాలాసార్లు చూశాను. కానీ ఆ సమయంలో అతడితో మాట్లాడటానికి తగినంత సమయం దొరకలేదు. ఓసారి మాత్రం అతడి దగ్గరకు వెళ్లి భుజంపై చేయి వేసి మాట్లాడాను. నేను కోచ్‌గా ఉండుంటే సిడ్నీ టెస్టు(బీజీటీలో ఆఖరి టెస్టు)లో ఆడకుండా ఉండేవాడివి కాదు అని చెప్పా.
సిరీస్ అప్పటికి ఇంకా ముగియలేదు కాబట్టి కచ్చితంగా మిమ్మల్ని ఆడించేవాడిని. ఎందుకంటే 2-1తో ప్రత్యర్ధి జట్టు ముందుంజలో ఉన్నా, నేను వెనకడుగు వేసే వ్యక్తిని కాదు. ఆఖరి టెస్టు మ్యాచ్ 30-40 పరుగుల తేడాతో సాగింది. సిడ్నీ పిచ్ చాలా ట్రిక్కీగా ఉంది. రోహిత్ ఫామ్‌లో ఉన్న లేకపోయానా జట్టులో కచ్చితంగా ఉండాల్సిందే.
ఎందుకంటే అతడు మ్యాచ్ విన్నర్. సరిగ్గా ఇదే విషయం రోహిత్ కూడా చెప్పాను. ఒకవేళ రోహిత్ ఆ మ్యాచ్‌లో ఆడి అక్కడ పరిస్థితులకు తగ్గట్టు జట్టును నడిపించి ఉంటే సిరీస్ సమమయ్యేది. అయితే ప్రతీ కోచ్‌కు వేర్వేరు స్టైల్స్ ఉంటాయి. ఇది నా శైలి. కేవలం నా ఆలోచిన విధానాన్ని మాత్రమే రోహిత్‌కు తెలియజేశాను.
ఎప్పటి నుంచో ఇది నా మనసులో ఉంది. ఎట్టకేలకు అతడికి తెలియజేశాను" అని ఐసీసీ రివ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నాడు. కాగా రవిశాస్త్రి వ్యాఖ్యలు బట్టి చూస్తే ప్రస్తుత భారత హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌కు పరోక్షంగా కౌంటరిచ్చినట్లు అన్పిస్తోంది. గంభీర్‌తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి విభేదాలు తలెత్తినట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో రో-కో టెస్టులకు వీడ్కోలు పలికినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.