
కేరళ టీ20 లీగ్‌లో నిన్న (ఆగస్ట్ 24) రసవత్తర మ్యాచ్ జరిగింది. ఏరీస్ కొల్లమ్ సైలర్స్, కొచ్చి బ్లూ టైగర్స్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు అసలుసిసలు టీ20 మజాను అందించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సైలర్స్ 236 పరుగుల భారీ స్కోర్ చేయగా.. టైగర్స్ చివరి బంతికి లక్ష్యాన్ని ఛేదించి అద్బుత విజయం సొంతం చేసుకుంది.
టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ విధ్వంసకర శతకంతో (51 బంతుల్లో 121; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) టైగర్స్‌ను విజయతీరాలకు చేర్చగా.. ఆషిక్ అనే ఆటగాడు ఆఖరి బంతికి సిక్సర్ బాది తన జట్టును గెలిపించాడు.
ఈ మ్యాచ్‌కు సంబంధించి అందరూ సంజూ శాంసన్, అషిక్ హీరోయిక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్‌మీడియా మొత్తం సంజూ నామస్మరణతో మార్మోగిపోతుంది.
అయితే సంజూ విధ్వంసకర శతకం నీడలో కొల్లమ్ సైలర్స్ ఆటగాడు, పంజాబ్ కింగ్స్ వికెట్‌కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్ సుడిగాలి ఇన్నింగ్స్ మరుగున పడింది. ఈ మ్యాచ్‌లో కొల్లమ్ సైలర్స్ అంత భారీ స్కోర్ చేయడంలో విష్ణు వినోద్ కీలకపాత్రధారి.
వినోద్ 41 బంతుల్లో 10 భారీ సిక్సర్లు, 3 బౌండరీల సాయంతో 94 పరుగులు చేశాడు. వినోద్ సిక్సర్ల సునామీ ధాటికి గ్రీన్ ఫీల్డ్ స్టేడియం తడిసి ముద్దైంది. వినోద్ 229.28 స్ట్రయిక్‌రేట్‌తో మెరుపులు మెరిపించాడు. శతకానికి మరో సిక్సర్ దూరంలో ఔటయ్యాడు.
వినోద్‌కు అతని కెప్టెన్ సచిన్ బేబి కూడా జతకలిశాడు. సచిన్ బేబి కూడా ఇంచుమించు విష్ణు తరహాలోనే విధ్వంసం సృష్టించాడు. 44 బంతుల్లో 6 సిక్సర్లు, 6 బౌండరీల సాయంతో 91 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో సైలర్స్ ఓడినా విష్ణు వినోద్ భారత టీ20 సారధి సూర్యకుమార్ యాదవ్‌ను గుర్తు చేశాడు. విష్ణు అచ్చం స్కై లాగే 360 డిగ్రీస్‌లో షాట్లు ఆడి అలరించాడు.
గత ఐపీఎల్ సీజన్‌లో విష్ణును పంజాబ్ కింగ్స్ ఎంపిక చేసుకున్నప్పటీకీ అతనికి ఒక్క అవకాశం కూడా రాలేదు. విష్ణు 2017, 2023 ఐపీఎల్ సీజన్లలో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ తరఫున అవకాశాలు దక్కించుకున్నా పెద్దగా రాణించలేకపోయాడు.
తాజా ప్రదర్శనతో విష్ణు ఐపీఎల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యాడు. ఒకవేళ పంజాబ్ విష్ణును వేలానికి వదిలేస్తే అతడికి మంచి గిరాకీ ఉండవచ్చు. కొన్ని ఫ్రాంచైజీలు స్థానిక విధ్వంసకర వికెట్‌కీపర్ బ్యాటర్ కోసం అన్వేషిస్తున్నాయి. ఈ పాత్రకు విష్ణు లాంటి టాలెంటెడ్ బ్యాటర్ న్యాయం చేయవచ్చు.