
‘నో- షేక్‌హ్యాండ్’ వివాదంలో రచ్చ చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆఖరికి తలవంచకతప్పలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై పీసీబీ చేసిన ఫిర్యాదులకు ఆధారాల్లేవని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాక్ బోర్డు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయింది.
ఫలితంగా ‘బాయ్‌కాట్’ నాటకాన్ని పక్కనపెట్టిన పాక్ జట్టు.. యూఏఈతో బుధవారం మ్యాచ్ ఆడింది. అంతేకాదు ఈ మ్యాచ్‌కు రిఫరీ కూడా ఆండీనే కావడం విశేషం. అయితే, ‘సమాచార లోపం కారణంగానే ఇది జరిగిందంటూ పైక్రాఫ్ట్ మాకు క్షమాపణ చెప్పారు.
ఆడియో లేని వీడియో.. చీప్ ట్రిక్స్
ఈ విషయంలో నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరిపిస్తామని ఐసీసీ కూడా చెప్పింది’ అంటూ పీసీబీ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పైక్రాఫ్ట్‌తో తమ బృందం చర్చిస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది.
అయితే పాక్ ఏదైనా రుజువులు చూపిస్తే తప్ప వారి ఆరోపణలపై తాము విచారణ చేసే అవకాశాలు లేవని ఐసీసీ అధికారి ఒకరు స్పష్టం చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఆడియో లేకుండా పాక్ విడుదల చేసిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరీ ఇలాంటి చీప్ ట్రిక్స్ పనికిరావని.. నిజంగానే రిఫరీ క్షమాపణ చెప్పి ఉంటే ఆడియో కూడా పెట్టాల్సిందని చురకలు అంటిస్తున్నారు.
బాయ్‌కాట్‌కు అందరి మద్దతు ఉంది.. కానీ
ఇదిలా ఉంటే.. తాము ఆసియా కప్ నుంచి వైదొలగకపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ పీసీబీ చీఫ్, ఆసియా క్రికెట్ మండలి ప్రస్తుత అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీ కూడా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు. ‘‘సెప్టెంబరు 14 తర్వాత జరిగిన పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. మ్యాచ్ రిఫరీ విషయంలో మేము అభ్యంతరాలు లేవనెత్తాము.
కాసేపటి క్రితమే మ్యాచ్ రిఫరీ మా జట్టు కోచ్, కెప్టెన్, మేనేజర్‌తో మాట్లాడారు. నో- షేక్‌హ్యాండ్ ఘటన జరగకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ విషయంలో విచారణ జరపాల్సిందేనని మేము ముందుగానే ఐసీసీకి ఫిర్యాదు చేశాం.
రాజకీయాలు, క్రీడలను కలపకూడదు. ఆటను ఆటగానే ఉండనివ్వాలి. ఒకవేళ మనం బాయ్‌కాట్ చేస్తే.. అదొక అతిపెద్ద నిర్ణయం అవుతుంది. మనకు ప్రధాన మంత్రి, ప్రభుత్వ అధికారులు, ప్రజల మద్దతు ఉంది.
చింత చచ్చినా పులుపు చావలేదు!
కానీ ఈ విషయాన్ని మేము నిశితంగా పరిశీలించి చర్యలు తీసుకుంటాం’’ అంటూ నక్వీ అసలు కారణం చెప్పకుండా చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా రిఫరీ విషయంలో తమదే పైచేయి అయినందన్నట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు.
కాగా సెప్టెంబరు 14న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత జట్టు పాక్ ఆటగాళ్లతో కరచాలనానికి నిరాకరించింది. దీంతో అవమానభారంతో రగిలిపోయిన పాక్.. బాయ్‌కాట్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అయితే, ఒకవేళ నిజంగానే వాళ్లు ఈ టోర్నీని బహిష్కరిస్తే మిగతా వారికి వచ్చే నష్టమేమీ లేదు.
వారికే నష్టం
ఇప్పటికే ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న పాక్ బోర్డు పరిస్థితి మాత్రం మరింత దిగజారడం ఖాయం. టోర్నీ నుంచి రావాల్సిన ఆదాయం కోసమే కొనసాగినా.. నక్వీ ఇలా సాకులు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. బుధవారం నాటి మ్యాచ్‌లో యూఏఈని ఓడించిన పాక్.. సూపర్-4కు అర్హత సాధించింది. ఈ క్రమంటో సెప్టెంబరు 21న సల్మాన్ ఆఘా బృందం టీమిండియాను ఢీకొట్టనుంది.
చదవండి: అతడు అత్యద్భుతం.. ఏ జట్టునైనా ఓడించగలము: పాక్ కెప్టెన్ ఓవరాక్షన్