
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2025-26కు (Ashes Series) ముందు ఆస్ట్రేలియా (Australia) జట్టుకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. గాయం కారణంగా కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) ఈ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం.
కమిన్స్ జులైలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వెన్ను సంబంధిత గాయానికి గురయ్యాడు. ఈ గాయమే అతన్ని యాషెస్ సిరీస్‌కు దూరం చేసేలా కనిపిస్తుంది.
సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ నివేదిక ప్రకారం.. కమిన్స్ ఇటీవల గాయానికి సంబంధించి స్కానింగ్ చేయించుకున్నాడు. ఇందులో అతని గాయం తీవ్రత తగ్గలేదని తేలింది. దీంతో నవంబర్ 21న పెర్త్‌లో ప్రారంభమయ్యే తొలి టెస్ట్ సమయానికి కమిన్స్ అందుబాటులో ఉండలేడు. పరిస్థితి చూస్తుంటే కమిన్స్ యాషెస్ సిరీస్ మొత్తానికి దూరమయ్యేలా ఉన్నాడన్నది సదరు నివేదిక సారాంశం.
వాస్తవానికి కమిన్స్ ఈ సిరీస్ కోసమే గతకొంతకాలంగా క్రికెట్ మొత్తానికే దూరంగా ఉన్నాడు. ఇటీవల ఆసీస్ ఆడిన ఏ ఫార్మాట్‌లోనూ అతను ఆడలేదు. త్వరలో భారత్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కూడా అతన్ని ఎంపిక చేయలేదు.
యాషెస్ సమయానికి పూర్తిగా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో కమిన్స్ ఈ మధ్యలో ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. తీరా చూస్తే అతని గాయం పూర్తిగా మానలేదని తెలుస్తుంది.
ఒకవేళ కమిన్స్ యాషెస్‌కు పూర్తిగా దూరమైతే ఆసీస్ క్రికెట్ బోర్డు ప్రత్యామ్నాయాలను సిద్దం చేసుకుంది. సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌కు తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. కమిన్స్ స్థానాన్ని స్కాట్ బోలాండ్‌తో భర్తీ చేయనున్నట్లు సమాచారం.
యాషెస్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇదివరకు ప్రకటించారు. నవంబర్ 21-25 వరకు పెర్త్ వేదికగా తొలి టెస్ట్ జరుగుతుంది. అనంతరం డిసెంబర్ 4న రెండో టెస్ట్ (బ్రిస్బేన్), డిసెంబర్ 17న మూడో టెస్ట్ (అడిలైడ్), డిసెంబర్ 26న నాలుగో టెస్ట్ (మెల్‌బోర్న్), వచ్చే ఏడాది జనవరి 4న ఐదో టెస్ట్ (సిడ్నీ) మొదలవుతాయి.
చదవండి: CEAT అవార్డుల విజేతలు వీరే.. రోహిత్ శర్మకు ప్రత్యేక పురస్కారం